గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల లేమికి ఈ ఘటన సజీవ సాక్ష్యం. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ సైతం రాలేక.. ఓ బాలింత ఏకంగా మూడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. ఈ ఘటన కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలంలోని ముర్లిగూడలో గురువారం చోటుచేసుకొంది.
ముర్లిగూడకు చెందిన పొరెట్టి కవితకు బుధవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు కాగజ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం.. ఆస్పత్రి నుంచి 102 అంబులెన్సులో ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో కమ్మర్గాం వరకు మాత్రమే అంబులెన్సు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. వారు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు.