mass wedding ceremony: ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిర్పూర్(యు) మండలంలోని మహాగామ్ గ్రామంలో ఏటా నిర్వహించే సామూహిక వివాహాలకు ఏటేటా ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది సంత్ శ్రీ కోట్నాక సరోజి మహరాజ్ గురుదేవ్ సేవ ఆశ్రమంలో సామూహిక వివాహాల తంతు జరిగింది. సంత్ శ్రీ సరోజి మహారాజ్ చూపిన మార్గాన్ని ఆయన భక్తులు నేటికీ ఆచరిస్తూ నలుగురికీ చాటి చెప్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మహారాష్ట్రలోని కిన్వత్ తాలూకా సోనే గావ్ గ్రామంలో జన్మించిన సంత్ శ్రీ సరోజి మహారాజ్ మహాగామ్ గ్రామానికి వచ్చి ఇక్కడి ప్రజలకు మంచి చెడులు బోధించేవారు. ముఖ్యంగా మద్యానికి, మాంసాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించారు. క్రమేణా 1950వ సంవత్సరంలో గ్రామంలోని గుట్టపై శివాలయాన్ని నిర్మించారు. 1970లో సముదాయీక్ ప్రార్థన మందిరం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికతతో పాటు ఆచార వ్యవహారాలకు ఇక్కడి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
తాళిబొట్టు.. మెట్టెలు... అన్నదానం
నాలుగేళ్ల నుంచి ఈ గ్రామంలో జరిగే సామూహిక వివాహాలకు జెడ్పీ ఛైర్‌పర్సన్ కోవ లక్ష్మి తాళిబొట్టు, మెట్టెలు అందిస్తున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సేవాశ్రమానికి ప్రజా ప్రతినిధులు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆశ్రమం యొక్క పీఠాధిపతి కైలాస్ మహారాజ్ తెలిపారు. మహారాజు చూపిన ఆధ్యాత్మిక మార్గాన్ని పాటిస్తూ ప్రజలందరికీ చాటి చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. పేదల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా కళ్యాణం జరిపించడం ఇక్కడి ప్రత్యేకత అని సూరోజి భక్తుడు భీం రావు తెలిపారు.