కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులన్నీ ఛిద్రమైపోతున్నాయి. రహదారులలోని గుంతలు.. మురుగునీటి తటాకాలను తలపిస్తున్నాయి. రోడ్డుపై ప్రయాణించాలంటే నరకం కనిపిస్తుందని వాహనచోదకులు వాపోతున్నారు. చిత్తడి రోడ్లపై రాకపోకలు సాగించే వారు ప్రమాదాలకు గురవుతున్నారు.
వర్షాలతో నరకప్రాయంగా మారుతున్న రహదారులు - kumuram bheem asifabad roads damage due to rains
ఓ మోస్తరు వర్షానికే రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్లపై ప్రయాణించడానికి వాహన చోదకులు భయపడుతున్నారు. గుంతల మట్టి రోడ్లపై రాత్రిళ్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ శాఖల పరిధిలోని రహదారులు కనీస మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారి జనాలకు నరకం చూపిస్తున్నాయి.
![వర్షాలతో నరకప్రాయంగా మారుతున్న రహదారులు kumuram bheem asifabad roads damage due to rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8145199-1077-8145199-1595515452979.jpg)
అధ్వానంగా మారిన రహదారులను మరమ్మతులు చేయాలని కోరుతున్నా... అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఇందాని, ఖిరిడీ గ్రామాలకు మట్టి రోడ్లే ఉండటం వల్ల... చిన్నపాటి వర్షానికి మొత్తం బురదమయంగా మారాయి. ఆసిఫాబాద్ మండలం నుంచి ఖిరిడీ, ఇందాని గ్రామాలకు వెళ్లాలంటే బురదలో నుంచి పోవాల్సిందే. ఇలాంటి రోడ్లతో ఆటోలు నాలుగు రోజులకే పాడైపోయి ఆర్థికంగా చితికి పోతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రహదారి కోసం ఖిరిడీ గ్రామస్థులు ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం వరకు గతేడాది పాదయాత్ర చేసి పాలనాధికారికి వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి వెంటనే రోడ్డు సమస్యను పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు.