కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పేదలకు అందుబాటులోకి కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలు వచ్చాయని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కోవలక్ష్మీ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి ఆవరణలో రూ.38 లక్షల వ్యయంతో నిర్మించిన జిల్లా డయాగ్నస్టిక్ సెంటర్ను(diagnostic centre) జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పలతో కలిసి ఆమె బుధవారం ప్రారంభించారు.
అత్యాధునిక హంగులతో పేదలకు ఉచితంగా 57 రకాల పరీక్షలు చేయడానికి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసిందన్నారు. వీటిద్వారా పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు త్వరితగతిన జరుగుతాయని తెలిపారు. జిల్లా డయాగ్నస్టిక్ కేంద్రంలో(diagnostic centre) కోటి యాభై లక్షలతో బయో కెమిస్ట్రీ మిషనరీతో పాటు, మూడు లక్షల రూపాయలతో సీబీపీ విశ్లేషణ పరీక్షల కోసం, అంతేగాక లక్షా 50 వేలతో మూత్ర పరీక్షలు చేయడానికి అవసరమైన మిషినరీలు సమకూర్చడం జరిగిందన్నారు. పేదలు ఈ వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు… శాంపిల్ సేకరించడం జరుగుతుందని డయాగ్నొస్టిక్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. జిల్లాలోని 15 మండలాలను మూడు రూట్లుగా విభజించామని, ఆయా రూట్లలో ప్రత్యేకంగా శాంపిల్ సేకరణ వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా శాంపిల్స్ జిల్లా డయాగ్నస్టిక్ సెంటర్కు చేరుకుంటాయని… అనంతరం పరీక్షలు చేసి ఆన్లైన్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రిపోర్టులు పంపించనున్నట్లు వెల్లడించారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా రెండు వాహనాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలని కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సూచించారు. దీనికి కలెక్టర్ రాహుల్ రాజ్ స్పందిస్తూ వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కుమురం బాలు, ఆసుపత్రి సూపరింటెండెంట్ స్వామి, ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేష్, డిప్యూటీ జిల్లా వైద్యాధికారులు సునీల్ రావు, సుధాకర్ నాయక్, తెరాస నాయకులు బాలేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:indrakaran reddy: 'ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం'