Koti goti Talambralu: భద్రాద్రి రాములోరి కల్యాణానికి గోటితో కోటి తలంబ్రాలు తయారు చేసి.. పంపించే కార్యక్రమాన్ని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు చేపట్టారు. రెండేళ్లుగా ఆసిఫాబాద్ మహిళలు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామం నుంచి వడ్లను తెప్పించి... గోటితో ఒలిచి భద్రాచలం పంపిస్తున్నారు. స్థానిక వాసవి కన్యాకపరమేశ్వరి ఆలయంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. రాములవారి పాటలు, లలిత సహస్రనామాలు ఆలపిస్తూ మహిళలు భక్తి శ్రద్ధలతో వడ్లను ఒలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు వృద్ధులు కూడా పాల్గొని రామయ్యపై భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. అదేవిధంగా కాళేశ్వరం పుష్కరాల కోసం పసుపుతో గౌరమ్మలను తయారుచేస్తున్నారు.
మా అదృష్టంగా భావిస్తున్నాం
రెండేళ్లుగా గోటితో కోటి తలంబ్రాలు కార్యక్రమంలో పాల్గొంటున్నామని మహిళలు తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి రోజున భద్రాచలంలో రాములవారి కల్యాణానికి హాజరు కాకపోయినప్పటికీ.. తమ చేతుల మీదుగా తలంబ్రాలు తయారుచేయటం ఎంతో అదృష్టమని పేర్కొన్నారు. స్వామి వారి సేవలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. అదేవిధంగా కాళేశ్వరం పుష్కరాల కోసం పసుపుతో గౌరమ్మలను తయారుచేసి పంపతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.