ఆ ఇంట్లో ప్రతిరోజు 150 కిలోల బియ్యం ఉడకాల్సిందే.. - free food distribution in asifabad
అధికారం ఉన్నా, లేకున్నా, ఆపద సమయంలో ఆకలితో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెట్టడంలో ఉన్న ఆనందం ముందు ఏదీ ఎక్కువ కాదు అంటున్నారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి. పదకొండేళ్ల నుంచి ప్రతిరోజు వారింట్లో భోజనం వండి పేదల ఆకలి తీరుస్తున్నారు. ఇతరత్రాల్లోనూ సాయమందిస్తున్నారు. కష్టాలు తీరి, కడుపు నిండిన పేదల ముఖాల్లో సంతోషాన్ని చూస్తే కలిగే తృప్తే వేరని ఆమె చెబుతున్నారు.
కోనేరు రమాదేవి, కాగజ్‌నగర్‌లో నిత్యాన్నదానం
By
Published : Jun 24, 2021, 10:02 AM IST
|
Updated : Jun 24, 2021, 10:13 AM IST
పండగ కాదు.. పెళ్లికాదు.. కానీ రోజూ ఆ ఇంట్లో 150 కిలోల బియ్యం ఉడకాల్సిందే... అన్నార్తుల కడుపు నిండాల్సిందే! పదకొండేళ్లుగా ఈ నిత్యాన్నదానాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నారు కోనేరు రమాదేవి...
ఆ ఇంట్లో ప్రతిరోజు 150 కిలోల బియ్యం ఉడకాల్సిందే..
కొవిడ్ కారణంగా అనేకమంది ఉపాధిలేక పస్తులున్నారు. వీరిందరికీ మేమున్నాం అని భరోసా ఇచ్చి వారి ఆకలిబాధను తీర్చారు రమాదేవి. ఈ యజ్ఞం నిన్నా మొన్నటిది కాదు. పదకొండేళ్ల క్రితం పేదల ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో సిర్పూర్-కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన సతీమణి రమాదేవి దీన్ని కొనసాగిస్తున్నారు.
ఆ ఇంట్లో ఉదయం ఆరు గంటలకే పొయ్యి వెలుగుతుంది. పాతికమంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి వంట-వార్పులో దిగుతారు. కూరగాయలు తరుగుతూ, బియ్యం పొయ్యిమీద కెక్కిస్తూ, తాలింపులు వేస్తూ సందడిగా ఉంటుంది ఆ ఇంటి వాతావరణం. వీటన్నింటిని రమాదేవి పర్యవేక్షిస్తారు. అన్నం, పప్పులు, ఊరగాయ, కూరలను ప్యాక్ చేసి విస్తర్లు సైతం అందజేస్తున్నారు.
ఈ క్రతువులో ఆమెతోపాటు ఆమె తోటికోడళ్లు కోనేరు ఉషాకిరణ్, విజయశ్రీ, రుక్మిణిదేవితో పాటు కుమార్తె ప్రతిమ రోజూ పాల్గొంటారు. ‘1981లో మా వివాహమైంది. ఎమ్మెల్యేగా ఆయన ఇంటి వద్ద ఉండడం తక్కువ. తక్కిన కుటుంబ సభ్యులంతా ఈ పనిలో నిమగ్నమవుతాం. మా ఫోన్ నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉంచాం. వాటికి రోజూ వందలమంది భోజనం కావాలని సంప్రదిస్తారు. స్వచ్ఛంద కార్యకర్తలు 20 మంది భోజనపు సంచులను తీసుకెళ్లి పంచి వస్తున్నారు. ప్రస్తుతం ఆరొందలమందికి భోజనాన్ని అందిస్తున్నాం.
నిత్యం రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతుంది. ఉదయం 75 కిలోల బియ్యం, సాయంత్రం 75 కిలోలు మొత్తం 1.50 క్వింటాళ్లు, క్వింటా కూరగాయలను వండుతున్నాం. ఇందుకు కొందరు దాతలు సహకరిస్తున్నారు. కర్మ కార్యక్రమాలకు భోజనాలు కావాలని కూడా కొందరు పేదలు సంప్రదిస్తూంటారు. ఇప్పటి వరకు 50 పైనే కార్యక్రమాలకు ఇలా భోజనం అందించాం. ఎంత మంది ఉన్నా ముందుగా ఫోన్ చేసి చెప్తే చాలు భోజనం వారి ఇళ్ల వద్దకే చేరుస్తున్నాం. ప్రజలకు కరోనా కష్టకాలంలో అండగా ఉండాలనే సంకల్పంతో 40 ఆక్సిజన్ సిలెండర్లు తెప్పించి నిరంతరం అందుబాటులో ఉంచాం. అధికారం ఉన్నా, లేకున్నా, ఆపద సమయంలో వారికి కడుపునిండా భోజనం పెట్టడం, వైద్యపరంగా అండగా ఉండటంతో వారి కళ్లలో కనిపించే ఆనందం ముందు ఏదీ ఎక్కువ కాదు. కష్టాలు తీరి, కడుపు నిండిన పేదల ముఖాల్లో సంతోషాన్ని చూస్తే కలిగే తృప్తే వేరు’ అని వివరించారు రమాదేవి.