కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని పాత రౌటసంకేపల్లికి చెందిన గజ్జెల రాణి పురిటి నొప్పులతో ప్రసవం కోసం మండల కేంద్రానికి బయలుదేరింది. ఆస్పత్రికి చేరుకోవడానికి రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేక.. గుంతల రోడ్డులోనే ఎడ్లబండిపై ప్రయాణించి చివరికి రోడ్డు మీదనే మృత శిశువును ప్రసవించింది. ఈ విషయాన్ని ఈటీవీ కథనం ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరుసటి రోజు ఉదయమే.. పాతరౌట సంకేపల్లికి చేరుకున్నారు. బాధితురాలు గజ్జెల రాణి ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. గ్రామస్థులతో మమేకమై రెండు గంటలపాటు మాట్లాడారు. మిషన్ భగీరథ నీరు అందుతుందా, అంగన్వాడీ కేంద్రం ఉందా, అందరూ పోషకాహారం తీసుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించడం కోసం కలెక్టర్ అత్యవసర నిధి నుంచి రూ.40 లక్షలు విడుదల చేసి.. వెంటనే పనులు ప్రారంభించాలని ఐటీడీఏ డీఈ భీమ్రావును ఆదేశించారు. గ్రామానికి వెళ్లే మార్గంలో అడ్డంగా ఉన్న రెండు వాగులపై మూడు చోట్ల కల్వర్టులు నిర్మించాలని.. అందుకు రూ.20 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు.
ఈటీవీ కథనానికి స్పందన.. కదిలిన జిల్లా యంత్రాంగం
గతుకుల దారిలో రెండు కిలోమీటర్లు ఎడ్లబండిపై ప్రయాణించి.. చివరికి రోడ్డుపైనే ప్రసవించిన గిరిజన మహిళ గురించి.. ఈటీవీలో ప్రసారమైన కథనానికి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా స్పందించి.. వెంటనే బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ ప్రాంత సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో ఉన్నవారిని గుర్తించిన పాలనాధికారి అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రం, కమ్యూనిటీ కేంద్రం కోసం భవనాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు గానూ.. రూ.5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని పీఆర్ సిబ్బంది పాలనాధికారికి వివరించారు. ఆసక్తి ఉన్న రైతులకు గిరి ఆవులను పెంచుకోవడానికి ఐటీడీఏ నుంచి ఆవులను ఉచితంగా అందించాలని డీటీడీఓ దిలీప్ కుమార్‌ను ఆదేశించారు. 60 సంవత్సరాలు నిండిన అర్హులైన వయోవృద్ధులకు ఆసరా పింఛన్ అందేలా చూడాలని డ్వామా పీడీ వెంకట శైలేష్‌కు సూచించారు.
బాధితుల కుటుంబమైన గజ్జెల రాణి కుటుంబంతో చాలాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం రాణి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కనుకున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కొమురం బాలును పిలిచి రాణి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలోని వయోవృద్ధులు, పిల్లలు, గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిరోజూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎం వచ్చి ఆరోగ్య పరిస్థితులపై తెలుసుకొని ఆ సమాచారాన్ని తనకు చేరవేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి:ఎవరికో కొమ్ము కాస్తూ.. సంస్కారానికి నిప్పు పెట్టేశారే!