కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మహారాష్ట్ర, ఏపీ, హైదరాబాద్ నుంచి పదిహేను రోజుల్లో బీటీ3 పత్తి విత్తనాలు వరదలా జిల్లాకు చేరాయి. మహారాష్ట్ర నుంచి జిల్లా సరిహద్దు మండలాలైన జైనూర్, కెరమెరిల్లోనికి విత్తనాలు వస్తున్నాయి.
నకి'లీలలు': చాపకింద నీరులా నకిలీ విత్తనాల వ్యాపారం - asifabad police caught duplicate cotton seeds
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఏటా ఈ తంతు జరుగుతున్నా.. నకిలీ దందాకు అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా జైనూర్ మండలంలో 540 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.

కెరమెరిలో కారులో తరలిస్తోన్న 54 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైనూర్ మండలంలో 540 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.4 లక్షల 32వేలు ఉంటుందని తెలిపారు. వీటిని తరలిస్తోన్న ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు హైదరాబాద్‌కు, ఐదుగురు జైనూర్‌కు, ఒకరు కర్నూల్‌కు చెందిన వారిగా గుర్తించారు
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జైనూర్ పోలీసులు హెచ్చరించారు. జిల్లాలోని అన్ని డివిజన్లు, మండలాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. బీటీ3 పత్తి విత్తనాలు సరఫరా చేసే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. రైతులు బీటీ3 నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి నష్టపోకూడదని సూచించారు.
- ఇవీ చూడండి:నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం.!