రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మరణాల సంఖ్య పెరిగింది. కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు సైతం ముందుకు రావడం లేదు. మరోవైపు అంత్యక్రియలు నిర్వహించేందుకు పలువురు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కానీ కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పలువురు ముస్లిం యువకులు మానవత్వం చాటుకుంటున్నారు. కరోనా మృతులకు దహన సంస్కారాలు చేస్తున్నారు. కాగజ్ నగర్ యూనిటీ సభ్యులు ఎం.ఎ. వసీం తన మిత్రులతో కలిసి కొవిడ్ నిబంధనలతో పీపీఈ కిట్లు ధరించి వారి వారి మతాచారాల ప్రకారం అంతిమ కార్యాలు చేస్తున్నారు.
మానవత్వం: కరోనా మృతులకు కాగజ్‌నగర్ యూనిటీ అంత్యక్రియలు - తెలంగాణ వార్తలు
యావత్ రాష్ట్రం కరోనాతో అతలాకుతలమవుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరగడంతో పాటు మరణాలు కూడా అదే సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌తో మృతి చెందిన వారికి దహన సంస్కారాలు నిర్వహించడానికి సొంత కుటుంబీకులే భయపడుతున్నారు. కానీ మానవత్వం బతికే ఉందని నిరూపిస్తూ కొందరు ముందుకొచ్చి కొవిడ్ నిబంధనలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కుల, మత తేడా లేకుండా కరోనాతో చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేస్తున్నారు.
ఈ రోజు ఉదయం ఈస్గాంకి చెందిన కరోనా రోగి మృతి చెందాడని, అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉందని సమాచారం రావడంతో.. రంజాన్ పండుగ ఉన్నప్పటికీ ఉదయం పూట నమాజ్ చదివిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంలో నివసించే ఎం.ఎ. వసీం తన మిత్ర బృందంతో కలిసి కాగజ్ నగర్ యూనిటీ అనే స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వహిస్తున్నారు. గతేడాది లాక్డౌన్లో ఆకలితో అలమటించిన పేదలకు తన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు