Telangana Inter Supplementary Exams 2023 : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 13 మంది విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఉదయం గణితం 1బి, జువాలజీ, హిస్టరీ పరీక్షలు నిర్వహించగా 91 మంది విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల సిబ్బంది విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.
13 Inter Students Debar in Kumurambheem District : పరీక్షలు ప్రారంభం కాగా.. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంటర్మీడియట్ బోర్డు తనిఖీ బృందం పరీక్షా కేంద్రాన్ని సందర్శించింది. విద్యార్థులను తనిఖీ చేయగా.. 13 మంది విద్యార్థుల వద్ద నకల చిట్టీలు లభ్యం అయ్యాయి. 13 మంది విద్యార్థులను పరీక్షలు రాయకుండా డీబార్ చేసిన అధికారులు.. ఇద్దరు ఇన్విజిలేటర్లపై చర్యలకు ఆదేశించారు. విద్యార్థులను క్షుణ్నంగా తనిఖీలు చేసి లోపలికి పంపించామని కళాశాల సిబ్బంది చెబుతున్నప్పటికీ 13 మంది వద్ద చిట్టీలు దొరకడం గమనార్హం. ఏకంగా 13 మంది డీబార్ కావడం.. నకలు వ్యవహారం పెద్ద ఎత్తున సాగుతుందనడానికి నిదర్శనం అని పలువురు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలో మార్చి నెలలో ప్రారంభమైన ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌లో ముగిశాయి. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో 62.85 శాతం, రెండో సంవత్సరం ఫలితాల్లో 67.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్.. సెకండియర్‌లో ములుగు జిల్లాలు ప్రథమ స్థానంలో నిలిచాయి.