కాగజ్నగర్ పురపాలిక అధికారులు జులై 1న హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా వందల సంఖ్యలో మాత్రమే మొక్కలు నాటారు. శ్మశానవాటికలు, ఈఎస్ఐ రిజర్వాయర్ ఏరియా, పిల్లల ఉద్యావనం, మసీదు, దేవాలయాల్లోని ఖాళీ స్థలాల్లో దాదాపు 40 నుంచి 50 వేల మొక్కలు నాటినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు నాలుగు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించిన ప్రభుత్వం పురపాలికకు కేవలం ఒకే ఒక నర్సరీ ఏర్పాటు చేసింది. కాగజ్ నగర్ మండల పరిధిలోని వంజీరి సమీపంలోని రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం బల్దియా నర్సరీల కోసం కేటాయించింది. ఆ భూమిని సరిగ్గా వినియోగించుకోక.. నిరుపయోగంగా మార్చారు.
అటవీ శాఖ, ఇతర శాఖల నుంచి నుంచి పురపాలిక అధికారులు దాదాపు 50 వేల మొక్కలను తీసుకొచ్చినట్లు తెలిసింది. పచ్చదనం పెంపు కోసం పురపాలిక బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించడం వల్ల కొనుగోలు ప్రక్రియ సులువవుతుందని అధికా రులు భావిస్తున్నారు. స్థానిక బల్దియా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మొక్కలు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. బల్దియా, ఇతర నర్సరీల్లోనూ పూలు, పండ్ల, వివిధ రకాల మొక్కల కొరత ఉంది. పట్టణ ప్రజలు తమ ఖాళీస్థలాల్లో ఎక్కు వగా పూలు, పండ్ల మొక్కలను నాటేందుకు ఇష్టపడుతున్నారు.