రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కరవవడంతో విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కోరల్లోకి వెళ్లిపోతోంది. ఇది ప్రభుత్వ స్థలమంటూ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని మాయం చేస్తున్నారు. మరోచోట ఆ బోర్డును కొంతదూరం మార్పు చేసి, మరీ ఆక్రమించుకుంటున్నారు.
2004-05లో అప్పటి ప్రభుత్వం కాగజ్‌నగర్ పురపాలికలోని ఆదర్శ వార్డులను ఎంపిక చేసింది. పట్టణంలోని 28 వార్డుల్లో నివాస స్థలం.. పక్కా గృహం లేని 1304 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. పట్టణం, సమీపంలోని ప్రభుత్వ స్థలం లేక పోవడంతో కాగజ్‌నగర్ మండలంలోని బోరిగాం, చారిగాం ఏరియాలోని సర్వేనెం.117,119,120,125,126లో పట్టాదారుల నుంచి దాదాపు 71 ఎకరాల భూములను రూ.2.70 కోట్లతో కొనుగోలు చేశారు.
పురపాలిక ఆధ్వర్యంలో లే-అవుట్ తయారు చేసి, ప్లాట్లుగా విభజించారు.ఎంపికైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం కూడా పక్కా గృహాలను మంజూరు చేసింది. ఇళ్ల పనులు దక్కించుకున్న ఓ గుత్తేదారు ఆ గృహాలను నాసిరకంగా నిర్మించడంతో అవన్నీ ప్రారంభానికి ముందే శిథిలమయ్యాయి.దీంతో లబ్ధిదారులు ఆ ఇళ్లల్లో ఉండేందుకు అంగీకరించలేదు.ఆ ఇళ్లన్ని నిరుపయోగంగా మారడంతో కబ్జాదారుల కన్ను వీటిపై పడింది.