కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ శివారు.. వాగు ఒడ్డున శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొలువు దీరింది. ఈ ఆలయ నిర్మాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. రెబ్బెన మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రకృతి ఒడిలో వెలిసింది. 16వ శతాబ్దానికి పూర్వం గంగాపూర్ గ్రామానికి చెందిన బ్రాహ్మణడు ముమ్మడి పోతాజీ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పూజారులు చెబుతున్నారు.
కాలినడకన వెళ్లి మొక్కులు
'పోతాజీ చిన్నతనంలోనే ప్రతి ఏడాది మాఘశుద్ధ పౌర్ణమి రోజు కాలినడకన తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించుకునేవాడు. ఆ తర్వాత వయసు పైబడటం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక సంవత్సరం స్వామి చెంతకు వెళ్లలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అతని బాధను ఆలకించిన స్వామి ఓ రోజు రాత్రి కలలో దర్శనమిచ్చారు. గ్రామ పొలిమేరలోని గుట్ట ముందు భాగంలో ఆలయం నిర్మించాలని సూచించారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు అక్కడే భక్తులకు దర్శనమిస్తానని స్వామి కలలో చెప్పారు.' అని అక్కడి భక్తులు చెబుతున్నారు.