అటవీ సంరక్షణకై కఠిన చర్యలు తీసుకుంటున్న అధికారులు అడవుల విధ్వంసాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు దాడులు విస్తృతం చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు.
పోడు భూములుగా మార్చిన వైనం
అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 12 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ప్రస్తుతం మూడో వంతు అటవీ ప్రాంతం వివిధ కారణాలతో మైదాన ప్రాంతంగా మారింది. సింహ భాగం భూమిని చుట్టుపక్కల ఆదివాసీలు పోడు భూములుగా మార్చి సాగు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాన్ని స్మగ్లర్లు కలప అక్రమ రవాణా దందాలకు ఉపయోగిస్తున్నారు. అటవీ సంరక్షణపై దృష్టి సారించిన ప్రభుత్వం తనిఖీ అధికారాన్ని అటవీ అధికారులతో పాటు పోలీసులకు అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు దాడులు ముమ్మరం చేశారు. పోడు భూముల ఆక్రమణలు జరగకుండా.. కందకాలు తవ్వి రైతులను అందులోకి వెళ్లకుండా చేస్తున్నారు.
దాడుల్లో చిక్కుతున్న కలప
జిల్లాలో అటవీ, పోలీసు సిబ్బంది ఉమ్మడి తనిఖీల్లో కలప అక్రమ నిల్వలు బయటపడుతున్నాయి. 15 మండలాల్లో ఇటీవల దాదాపు కోటి రూపాయల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా తీవ్రం చేయడం వల్ల అటవీ సంపదను చాలా వరకు కాపాడుతున్నామని అటవీ అధికారి రంజిత్ నాయక్ తెలిపారు.
ఇంటి దొంగలపై నిఘా
చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాలోఅటవీ శాఖ సిబ్బందిపైనాఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులునిఘా తీవ్రతరం చేశారు. ఏ శాఖ అధికారులైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే నిర్భయంగా తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా అటవీ అధికారి రంజిత్ నాయక్ అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అటవీ సంరక్షణపై అధికారులు తీసుకుంటున్న చర్యలు స్వాగతించ దగినవే అయినా పోడు భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీనిపై ప్రభుత్వం స్పందించి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదీ చూడండి :లోక్‌సభ ఎన్నికల వేళ 15 కోట్లకు పైగా సొత్తు జప్తు