కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మనుషులను చంపుతున్న పెద్దపులి వేట కోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీనిని బోనులో బంధించేందుకు అటవీశాఖ ఆరు వారాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. మేకలు, దూడలను బోన్లలో ఉంచి అధికారులు ఎరవేసినా.. అక్కడివరకు వస్తున్న పెద్దపులుల ఆపదను పసిగట్టి పక్కనుంచి వెళుతున్నట్లు సమాచారం.
దీంతో మహారాష్ట్ర అటవీశాఖ సూచనల మేరకు మత్తుమందు ప్రయోగం (ట్రాంక్విలైజ్) ద్వారా చేసి పట్టుకునేందుకు తెలంగాణ అటవీశాఖ సిద్ధం అవుతోంది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డన్ తాజాగా అనుమతించారు. పెద్దపులులు ఏదైనా పశువును చంపినప్పుడు మాంసాన్ని ఒకేసారి తినేయదు. సగం తిని రెండోసారి మళ్లీ వస్తుంది. ఆ సమయానికల్లా అక్కడ మాటువేసి ట్రాంక్విలైజ్ చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. దీనికోసం నాలుగు ట్వ్రాంక్వి గన్లను సిద్ధం చేసినట్లు అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు. వెటర్నరీ వైద్యులు వరంగల్‌కు చెందిన డాక్టర్ ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ నవీన్‌కుమార్‌లను అందుబాటులో ఉండాలని కోరింది.
ఏనుగులపై వెళ్లి..
పులిని త్వరగా పట్టుకోవాలంటే.. అది ఉన్నచోటుకే వెళితేనే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘పశువుల్ని చంపిన చోటనే పులిని పట్టుకోవాలంటే చాలా రోజులు పడుతుంది. మత్తుమందు ప్రయోగించినా 15-20 నిమిషాల తర్వాతగానీ పులి స్పృహ కోల్పోదు. ఈలోగా కోపంతో దాడి చేయొచ్చు. ఇలాంటప్పుడు ప్రాణాలు కాపాడుకోవాలంటే పులికి అందనంత ఎత్తులో ఉండాలి. ఏనుగులపై కూర్చుంటే పులి దగ్గరికే వెళ్లి, ట్రాంక్విలైజ్ చేయొచ్చు. తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి తెప్పించాలి’ అని ‘వైల్డ్‌లైఫ్ ట్రాంక్యూఫోర్స్’ సంస్థ కార్యదర్శి నవాబ్ షఫత్ అలీఖాన్ సూచించారు.
విడతల వారీగా దుప్పులు
మరోవైపు పులుల ఆకలి తీర్చడానికి అవి అధికంగా తిరిగే కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌కు 200-300 చుక్కల దుప్పులను తరలించేందుకు అటవీశాఖ ఆదేశాలు జారీ చేసింది. వేటాడి ఆకలి తీర్చుకునేందుకు శాకాహార జంతువుల కొరత ఉండటంతో.. పెద్దపులులు ఆ ప్రాంతంలో పశువులను చంపుతున్నాయి. తాజాగా మనుషులపైనా దాడులకు దిగుతుండటంతో అటవీశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని జూపార్కు సహా శామీర్‌పేట, మహావీర్ హరిణ వనస్థలి జాతీయవనం నుంచి దుప్పుల్ని అటవీ ప్రాంతానికి తరలిస్తారు. జూపార్కు, హరిణ వనస్థలి, శామీర్‌పేట నుంచి దుప్పుల్ని కాగజ్‌నగర్ టైగర్ కారిడార్‌కు విడతల వారీగా పంపనున్నట్లు అటవీశాఖ వర్గాల సమాచారం. 12 పెద్దపులులు ఉన్న కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో 4-7వేల వరకు శాకాహార జంతువులు ఉండాలి. ఇప్పుడు 2,700 మాత్రమే ఉండటంతో.. పెద్దపులులు ఆకలితో అలమటిస్తున్నాయి. తాజాగా తీసుకెళ్లి వదిలే దుప్పులతో ఆకలి సమస్య కొంతమేర తీరుతుందని అటవీశాఖ భావిస్తోంది.