ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కొంతకాలంగా పెద్దపులుల సంచారం.. ప్రజల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ నెల 11న కుమురంభీం జిల్లా దహేగం మండలం దిగిడ అటవీప్రాంతంలో.. పశువులను మేపడానికి వెళ్లిన విఘ్నేష్ అనే యువకున్ని చంపడం.. ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం బెజ్జూరు మండలం సిద్ధాపూర్- మత్తడివాగు సమీపంలో మరోసారి పులి ప్రత్యక్షం కావడం వల్ల అటవీశాఖ మరింత అప్రమత్తమైంది.
కవ్వాల్ పులుల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ నేతృత్వంలో.. అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. విఘ్నేష్‌ను హతమార్చిన ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారుల బృందం.. స్థానికులకు భరోసా కల్పించేలా యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టింది. హైదరాబాద్ నుంచి రెండు పులిబోన్లను ప్రత్యేకంగా తెప్పించి దిగడా అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. పులి ఎరకోసం రెండు లేగదూడలు, రెండు మేకలను ఉంచి.. పులి సంచారాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు.