తెలంగాణ

telangana

ETV Bharat / state

తునికాకు సేకరణకు పులుల భయం.. అడవిలోకి వెళ్లాలంటే వణుకే - కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో పులుల భయం

గ్రామీణ ప్రాంత ప్రజలకు వేసవికాలంలో తునికాకు సేకరణ ఆదాయం సమకూర్చే వనరు. అలాగే కరోనా వ్యాధి రోజురోజుకు విజృంబిస్తున్న నేపథ్యంలో అన్ని రకాల పనులు నిలిచిపోయి తునికాకు సేకరణ ప్రత్యామ్నాయ ఉపాధిగా మారింది. కానీ అడవుల్లో పులుల సంచారం అధికమవడం వల్ల కూలీలు అటుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు.

తునికాకు సేకరణ
తునికాకు సేకరణ

By

Published : May 26, 2021, 11:32 PM IST

కుమురం భీం జిల్లాలోని కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో తునికాకు సేకరణ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఇది వరకు గ్రామ సరిహద్దులోని బీడు భూముల్లో తునికాకు లభ్యమయ్యేది. కానీ వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న మార్పులతో బీడు భూములు కూడా వ్యవసాయ భూములుగా మారిపోయాయి. అడవిలోకి వెళ్తే తప్ప నాణ్యమైన తునికాకు సేకరణ సాధ్యం కావడం లేదు.

13 పులులు, 15 చిరుత పులులు

కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోని అడవుల్లో క్రూరమైన మృగాలు సంఖ్య అధికం. 13 పులులు, సుమారుగా 15 చిరుత పులులు, ఎలుగుబంట్లు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా పెద్ద పులుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతేడాది నవంబర్​లో దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన యువకుడు, పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన యువతిపై పులులు దాడి చేసి హతమార్చాయి. మూగ జీవాలపై కూడా పెద్ద పులులు అదును దొరికినప్పుడల్లా దాడిచేసి చంపేస్తున్నాయి. అలాగే ప్రధాన రహదారిపైకి వచ్చి సంచరిస్తుంటాయి. కొంతమంది ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాల్లో పెట్టడంతో గిరిజనులు అడవిలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు.

ప్రాణాలకు తెగించి అడవిలోకి..

కరోనా పరిస్థితుల్లో రోజువారీ కూలీలు ఆర్థికంగా చితికి పోకుండా ఉండాలంటే తునికాకు సేకరించాల్సిందే. అందుకే వారు ప్రాణాలకు తెగించి అడవి బాట పడుతున్నారు. కాగజ్ నగర్ డివిజన్ అటవీప్రాంతంలో పెద్దపులులు సంచరిస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కుమురం భీమ్ జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారాం పెంచికలపేట, దహేగామ్ మండలంలోని అటవీ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. పులి కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. తూనికకు సేకరణ చేసేవారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

గుంపులుగా.. చప్పుడు చేస్తూ..

తునికాకు సేకరణకు వెళ్లేవారు గుంపులుగా.. చప్పుళ్ళు చేసుకుంటూ వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలలోపు, రాత్రి వేళల్లో అడవిలోకి వెళ్లరాదని తెలిపారు. అడవి లోపల నీటి కుంటలు, చెలిమెలు ఉన్న ప్రాంతంలో వన్య మృగాలు సంచరించే అవకాశం ఉన్నందున అటువైపుగా వెళ్ళకూడదన్నారు. దట్టమైన ఆటవీప్రాంతంలోకి వెళ్లరాదని సూచిస్తున్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తు వన్యమృగాల దాడిలో మరణిస్తే లక్ష రూపాయల నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి :'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'

ABOUT THE AUTHOR

...view details