నాగలి చేతపట్టి నిరంతరం స్వేదం చిందిస్తూ భూమికి పచ్చని రంగులను అద్దె కర్షకుడికి పంట ఆరంభం సమయంలోనే రుణమో రామచంద్రా అంటూ దిక్కులు చూడక తప్పడం లేదు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండగా, మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేక విలవిల్లాడుతున్నాడు. అన్నదాతలకు ఆర్థిక చేయూతనందించేలా అక్కరకొచ్చే రైతుబంధు సహాయాన్ని సైతం బ్యాంకర్లు బాకీ కింద జమ చేసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిపాటి వానలతో ఇప్పుడిప్పుడే జీవం పొసుకుంటున్న పంటను కాపాడుకోవడానికి సంబంధిత రైతులకు నిర్వహణ ఖర్చులు ప్రస్తుతం అత్యవసరం. భారీగా రుణ ప్రణాళికను రూపొందించిన అధికారులు పంట అదును దాటుతున్నా అందులో పావుశాతానికి సైతం చేరుకోకపోవడం ఏటా పారిపాటిగా మారుతోంది.
రైతులకు తెలీకుండానే రుణాలు రెన్యువల్
జిల్లాలో లక్షా ఆరువేల ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా 80 వేల ఎకరాల్లో పత్తి పంటను పండిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో రూ.674 కోట్లను రైతులకు పంట రుణాలుగా అందించాలని అధికారులు ప్రణాళిక విడుదల చేశారు. ఇప్పటి వరకు అరకొరగానే పంట రుణాలు అందించారు. రుణాల కోసం ఆయా బ్యాంకుల్లో రైతులు తమ పనులన్నీ మానేసి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్నారు. ఏజెన్సీ మండలాల్లో బ్యాంకర్లు సంబంధిత రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండానే పాత రుణాలను రెన్యూవల్ చేస్తూ, రైతుబంధు సహాయంలో కొత విధిస్తున్నారు. రుణం పూర్తిగా ముట్టకపోయినా కోత విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరోవైపు రుణం పూర్తిగా చెల్లిస్తేనే కొత్త రుణం మంజూరు చేస్తానని బ్యాంకర్లు స్పష్టం చేయడం, సంవత్సరం లోపు చెల్లించకపోతే వడ్డీ భారం పడుతుందేమోననే భయంతో కొందరు రైతులు రుణాలు చెల్లిస్తున్నారు. రుణాల రెన్యువల్ సైతం ఒక ప్రణాళిక లేకుండా చేస్తున్నారు. మండలంలో ఉన్న గ్రామాల వారీగా తేదీలను నిర్ణయించి, రుణాలు పంపిణీ చేస్తే బ్యాంకుల్లో రద్దీ ఉండదని, నిరీక్షణ తప్పుతుందని రైతులు అంటున్నారు.
రైతు బంధు కోసం ఎదురుచూపులు...
గత ఖరీఫ్, రబీలలో ఎకరానికి రూ.4 వేలు చొప్పున అందిన రైతు బంధు సహాయం, ఈ ఖరీఫ్‌లో ఒక వెయ్యి ఎక్కువగా రూ.5 వేలు అందనుంది. అయిదు ఎకరాలకుపైగా ఉన్న రైతులకు ఈ సారి రైతుబంధు సహాయం అనుమానమేనని అధికారులే అంటున్నారు. జిల్లాలో గిరిజన రైతులకు చాలా మందికి ఒకే బ్యాంకు ఖాతా ఉంటుంది. ఈ ఖాతా ద్వారానే బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు. ఇదే ఖాతాను అధికారులు సేకరించి, రైతుబంధు సహాయాన్ని జమ చేయడం వల్ల బ్యాంకర్లు పాత రుణం కింద పెట్టుబడి సహాయాన్ని కత్తిరిస్తున్నారు. కొన్ని మండలాల్లో ఈ విషయమై రైతులు ఆందోళనలు సైతం చేశారు.
ఇతర ఖాతాలు ఇవ్వాలి