'మేము చెప్పినట్లు వింటేనే ధాన్యం కొంటాం.. లేదంటే మీకు చేతనైతే బయట అమ్ముకోండి' అని కుమురం భీం జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం.. రైతులతో అన్న మాటలివి. దీంతో రైతులు ఒక్కసారిగా ఆయనపై మండిపడ్డారు. కౌటాల మండలంలోని వీరవెల్లి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం.. రాజేశంతో పాటు డీఎస్వో స్వామికుమార్, కాగజ్ నగర్ ఏడీఏ శ్రీనివాస్ రావు సందర్శించారు. పలువురు రైతులు తమ సమస్యలను అధికారులతో విన్నవించుకున్నారు.
'పంట పండించడం కంటే.. అమ్ముకోవడమే పెద్ద సవాల్' - అదనపు కలెక్టర్‌పై వీరవెల్లి రైతుల ఆగ్రహం
ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై కుమురం భీం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను అధికారులకు విన్నవించుకుంటే వారు కూడా చులకన భావంగా మాట్లాడటం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది.
లారీ ధాన్యం అమ్మితే 20 క్వింటాళ్ల వరకు కోత విధిస్తే తామెట్లా బతకాలని రైతులు ప్రశ్నించారు. మిల్లర్లు, విత్తన యజమానులు సరఫరా చేసే వరి విత్తనాల్లో సైతం తాలు ఉంటుందని.. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని అధికారులను నిలదీశారు. రైతులంటే ఇంత చులకనా... పంటలు పండించడం కంటే అమ్ముకోవడం పెద్ద సవాలుగా మారిందని వాపోయారు. కోత విధించకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లారీలు మాత్రం సమయానుసారంగా పంపిస్తామని చెప్పి అధికారులు అక్కడి నుంచి నిష్క్రమించారు.
ఇదీ చదవండి:Black fungus: 'నాలుగు రోజుల్లో గుర్తిస్తే ఇబ్బంది ఉండదు'