పాక్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన సమయంలో వేలాదిమంది శరణార్థులు భారత్‌కు వలస వచ్చారు. వారికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ...కాగజ్‌నగర్ సమీపంలో పునరావాసం కల్పించారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని పలు గ్రామాల్లో 18 వేల మంది ప్రస్తుతం స్థిరనివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నారు. వారుంటున్న 13గ్రామాలను నజ్రుల్‌నగర్ పంచాయతీగా ఏర్పాటుచేశారు.
ప్రతి గ్రామంలో ఆధార్‌కార్డు దందా
కాందిశీకులుగా వచ్చిన వారికి కులంతోపాటు ఇతర ధ్రువీకరణ సమస్యల వల్ల సైన్యంలో చేరేందుకు కొన్ని స్వల్ప మినహాయింపులు ఇచ్చారు. వాటి ఆధారంగానే ఆర్మీలో ఉద్యోగాలు పొందుతున్నారు. ఇదే అదునుగా చేసుకొని కొందరు ఆధార్‌కార్డు దందాకు తెరలేపారు.
దళారులకు కాసుల పంట
నజ్రుల్‌నగర్ పరిధిలో జీవిస్తున్న కుటుంబాలకు బెంగాలీలతో సంబంధాలు కొనసాగుతున్నాయి. వ్యాపారాల లావాదేవీలు.. ఇతర అంశాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరచూ వస్తుంటారు. ఆ విషయాన్ని ఆసరాగా చేసుకొని కొందరు స్థానిక దళారులతో కలిసి ఆధార్ కార్డు దందాకు తెరతీశారు.