తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏళ్లుగా పింఛన్ల కోసం నిరీక్షణ.. అర్హుల ఆవేదన - kumurambheem asifabad district news

ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘ఆసరా’ పింఛను పథకం అర్హులకు అందడం లేదు. ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. అందని దుస్థితి. అధికారుల అండదండలతోనే బోగస్‌ పింఛన్లు మంజూరవుతున్నట్లు విమర్శలున్నాయి. గతంలో మంజూరైన దివ్యాంగుల పింఛన్లు సాంకేతిక సమస్య, తదితర కారణాలతో నిలిచిపోయాయి. తిరిగి దరఖాస్తు చేసినప్పటికీ అర్హులకు మంజూరు కావడం లేదు. వృద్ధులు, వితంతువులు ఏళ్లుగా ‘ఆసరా’ కోసం నిరీక్షిస్తున్నారు.

eligible people Waiting for pensions for years in kumurambheem asifabad district
ఏళ్లుగా పింఛన్ల కోసం నిరీక్షణ.. అర్హుల ఆవేదన

By

Published : Nov 5, 2020, 1:49 PM IST

దివ్యాంగులు, ఇతర పింఛన్లలో అక్రమాలు జరుగుతున్నాయనే పలు ఆరోపణల మేరకు అధికారులు గతేడాది కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో సర్వే చేపట్టారు. ఇందులో 2757 మంది, మృతి చెందిన 919 మంది పింఛన్లను అధికారులు నిలిపివేశారు. అయితే వాటిలో అర్హులైన వారి పేర్లను కూడా తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగజ్‌నగర్‌ బల్దియా పరిధిలోని 28వ వార్డుకు చెందిన ఖాసీంబీకి ఒక కాలు లేదు. సదరం క్యాంపులోనూ ఆమెకు 90 శాతం దివ్యాంగురాలిగా ధ్రువపత్రాన్ని జారీ చేశారు. రెండేళ్లుగా ఆమెకు ఫించను మంజూరు కావడం లేదు. అదే కాలనీలోని షేక్‌ మహ్మద్‌ దివ్యాంగుడు. మూగ, చెవిటి ఉన్నట్లు సదరంలో ధ్రువపత్రాన్ని జారీ చేశారు. గతంలో పింఛను మంజూరు కాగా ఇటీవలే నిలిచిపోయింది.

అనర్హులకు మంజూరు..

సర్‌సిల్క్‌ కాలనీకి చెందిన ఓ మహిళకు చేనేత పింఛను మంజూరు చేయగా.. ఫిర్యాదు మేరకు అధికారులు ఆమె బతికి ఉండగానే చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసి నిలిపివేసిన విషయం తెలిసిందే. అధికారుల తప్పిదంతో బోగస్‌ పింఛను మంజూరు చేయడంతో పాటు తమ తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు మళ్లీ మరో తప్పు చేయాల్సిన పరిస్థితి.

సాంకేతిక సమస్య

ఒకరి పింఛను మరొకరికి మంజూరవుతోంది. ఆధార్‌ కార్డు నెంబరు, సదరం ధ్రువపత్రం నెంబరు మరొకరి పేరిట మంజూరవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవలే కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు కాలనీల్లో ఇదే సమస్య ఎదురుకాగా అధికారులు సర్వే జరిపారు. ఇటీవలే వాటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయినా మరికొన్ని బోగస్‌ పింఛన్లు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు సమగ్ర సర్వే చేపడితే మరిన్ని బోగస్‌ పింఛన్లు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

పింఛను కోసం నిరీక్షణ..

మూడేళ్లుగా పింఛను కోసం నిరీక్షిస్తోంది ఈశ్వరమ్మ. 2017లోనే ఆమె భర్త రాజమల్లు అనారోగ్యంతో మృతి చెందారు. భర్తకు పింఛను ఉండగా, ఆ పింఛను తమ పేరిట మార్పు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. కార్యాలయం చుట్టూ నిత్యం తిరుగుతున్నారు.

మందులకు ఆసరాా అవుతాయని ఆవేదన

ఉప్పట్ల లక్ష్మి భర్త బక్కయ్య రెండేళ్ల కిందట మృతి చెందారు. వితంతు పింఛను కోసం అప్పుడే పురపాలికలో దరఖాస్తు చేసుకొన్నారు. అయితే ఇప్పటి వరకు మంజూరుకాలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పింఛను డబ్బులతోనైనా వైద్యపరీక్షలు, మందులకు ఆసరా అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు పట్టించుకోవట్లే..

85ఏళ్ల వయస్సు గల వృద్ధుడు ఎస్‌.నర్సయ్య వృద్ధాప్య పింఛను కోసం చాలా ఏళ్ల కిందటే దరఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కావడం లేదు. బల్దియా చుట్టూ నిత్యం తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అర్హులైన తనకు పింఛను మంజూరు చేయాలని ఆయన వేడుకుంటున్నాడు.

దివ్యాంగురాలికి నిలిచిపోయిన ఆసరా..

దివ్యాంగురాలు ఖాసీంబీకి సదరం శిబిరంలో ఆమెకు 90 శాతం దివ్యాంగురాలిగా ధ్రువపత్రం జారీ చేశారు. కొన్నేళ్లుగా పింఛను మంజూరైంది. అయితే ప్రభుత్వం దివ్యాంగుల పింఛను రూ.3016 పెంచిన తర్వాత ఆమె పింఛను నిలిచిపోయింది. దీనికి కారణాలు తెలియదు. మంజూరు కోసం మూడేళ్లుగా పాలనాధికారి, పుర అధికారుల చుట్టు తిరిగినా మంజూరు కావడం లేదని కంటతడి పెట్టుకుంది.

మహిళా కౌన్సిలర్‌ నిరసన..

రెండ్రోజుల కిందట జరిగిన బల్దియా సర్వసభ్య సమావేశంలో మహిళా కౌన్సిలర్‌ పంబాల సుజాత ఆసరా పింఛన్ల మంజూరులో జాప్యంపై అధికారుల పనితీరుకు వ్యతిరేకంగా.. నేలపైనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఛైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, కమిషనర్‌ శ్రీనివాస్‌ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

మంజూరు అయ్యేలా చర్యలు

ఆసరా పథకంలో అర్హులందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాం. బోగస్‌ పింఛన్లపై సర్వేలు జరిపి, తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. త్వరలోనే పాలనాధికారి దృష్టికి తీసుకుపోయి అర్హులైన వారికి మంజూరు చేసేందుకు చర్యలు చేపడుతాం. - శ్రీనివాస్‌, కమిషనర్‌

ఇవీ చూడండి:మంచి మాట.. మనిషిని మహనీయుడిని చేస్తుంది!

ABOUT THE AUTHOR

...view details