ఆదివాసీలు అసాంఘిక శక్తులకు దూరంగా ఉండి అబివృద్ధిపై దృష్టిపెట్టాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పీ సుధీంద్ర పేర్కొన్నారు. పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజనులకు సోలార్ బల్బులు అందించారు. తిర్యాని మండల కేంద్రానికి 5౦ కిలోమీటర్ల దూరములో అత్యంత మారుమూల తండాలకు.. గోవేన పంచాయతీ పరిధిలోని కుర్సిగూడ, పంగిడిమాదర తండాల్లో పంపిణీ చేశారు. దాదాపు 12 గూడెంలలో మొత్తం జనాభా 40 వరకు ఉంటారు. కొలాంగూడెం, నాయకపుగూడెంలలో విద్యుత్ సౌకర్యం కోసం ఐటీడీఏ అధికారులు ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు పనిచేయక అంధకారంలో మగ్గుతున్నారు.
గిరిజనుల జీవితాల్లో సోలార్ వెలుగులు - కస్తూరి ఫౌండేషన్
'పోలీస్ మీకోసం' కార్యక్రమంలో భాగంగా కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజనులకు సోలార్ ఎల్‌ఈడీ లైట్లు పంపిణీ చేశారు. ఆదివాసీలు అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఎస్పీ సుధీంద్ర సూచించారు. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏఎస్పీ విజ్ఞప్తి చేశారు.
పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన తిర్యాని ఎస్సై రామారావు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కస్తూరి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ చరణ్ సహకారంతో దాదాపు 50 గృహాలకు రెండు వేల రూపాయల విలువైన మూడు బల్బుల సెట్ అందించారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు సమస్యలను గుర్తించి వారి గృహాలలో వెలుగులు నింపిన ఎస్సై రామరావు, కస్తూరి ఫౌండేషణ్ ఛైర్మన్ చరణ్‌ను ఏఎస్పీ సుధీంద్ర అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ అచ్చేశ్వర్ రావు, రెబ్బెన సీఐ సతీశ్ కుమార్, ట్రస్మా కార్యదర్శి పద్మ చరణ్, లయన్స్ క్లబ్ శరత్, గోయెనా సర్పంచి కురిసేంగా చిత్రు, గ్రామస్తులు పాల్గొన్నారు.