తెలంగాణ

telangana

ETV Bharat / state

దిగొచ్చిన కోడి మాంసం ధరలు... బారులు తీరిన మాంసాహారులు - Chicken rates news

విపత్కర పరిస్థితులలో పౌష్టికాహారమైన కోడి మాంసం ధరలు కొండ దిగి వస్తున్నాయి. 15 రోజుల క్రితం కిలో రూ. 240 నుంచి రూ. 260 వరకు ఉండగా ప్రస్తుతం కిలో బాయిలర్ రూ. 140 నుంచి రూ. 160 కి పడిపోయింది. ఏకంగా వంద రూపాయల ధర తగ్గింది. చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇష్టమైన కోడి మాంసం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తూ చికెన్ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు మాంసాహార ప్రియులు.

chicken
chicken

By

Published : May 25, 2021, 2:47 PM IST



గత ఏడాది లాక్ డౌన్, బర్డ్ ఫ్లూ దెబ్బతో కోడి మాంసం ధర దారుణంగా పతనమైంది. ఒకానొక సందర్భంలో కోడిని రూ. 10, 20కు అమ్ముకోవాల్సి వచ్చింది. కొన్నిచోట్ల వీధివీధి తిరిగి కూరగాయల మాదిరిగా కోళ్లను విక్రయించారు. చికెన్ వినియోగంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని… ప్రభుత్వం, వైద్యులు చెప్పగా చికెన్ వినియోగం పెరిగి ధరలు కూడా పెరిగాయి. 15 రోజుల క్రితం వరకు కిలో చికెన్ ధర సుమారు రూ. 260 వరకు పలికింది. అయితే ఇటీవలి పరిస్థితులలోఒక్కసారిగా ధరలు తగ్గాయి.

అదే విధంగా లాక్ డౌన్ సమయంలో ఉదయం పూట నాలుగు గంటలు మాత్రమే సడలింపు ఉండడంతో హోటల్లు, బార్లు తెరవలేని పరిస్థితి నెలకొంది. చికెన్ విక్రయాలు పడిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోళ్లను ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాలకు తరలిస్తుంటారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తుండటంతో కోళ్ల రవాణా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గి చికెన్ ధరలు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.

కోళ్లఫారం యజమానుల ఆందోళన…

కాగజ్ నగర్ పట్టణంతో పాటు పరిసర మండలాల్లో హోల్ సెల్, రిటైల్ చికెన్ దుకాణాలు దాదాపు 200పైగా ఉన్నాయి. రోజూ దాదాపు 150 క్వింటాళ్లకు పైగా విక్రయాలు జరిగేవి. కరోనా నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి చికెన్ సెంటర్లలో బాయిలర్ కోడి మాంసం ధరలు తగ్గాయి. 15 రోజుల క్రితం వరకు రూ. 260 పలికిన కిలో చికెన్ ధర నేడు రూ. 140కి పడిపోయింది. ప్రస్తుతం లైవ్ చికెన్ కిలో రూ. 57, స్కిన్ లెస్ రూ. 160 చొప్పున విక్రయాలు చేస్తున్నారు. ధరలు తగ్గుతుండటంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తుండగా కోళ్ల ఫారం, చికెన్ సెంటర్ల నిర్వాహకులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

దేశీకోడికి గిరాకీ…

ఒకవైపు బాయిలర్ చికెన్ ధరలు రోజు రోజుకు తగ్గుతుంటే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దేశీకోడికి గిరాకీ పెరుగుతోంది. బాయిలర్ కోళ్లకు కరోనా సోకిందని వదంతుల మధ్య దేశీకోడి వైపు మొగ్గు చూపుతున్నారు. కిలో దేశీకోడి రూ. 400 కాగా డ్రెస్సెడ్ చికెన్ కిలో రూ. 450 వరకు విక్రయిస్తున్నారు. సామాన్య ప్రజలు దేశీకోడి తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎండ తీవ్రతకు బాయిలర్ కోళ్లు చనిపోతుండగా మరోవైపు రోజురోజుకు తగ్గుతున్న ధరలతో నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. రానున్న రోజుల్లో చికెన్ మాంసం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని వ్యాపారులు ఆందోళన చెందుతుండగా.. మాంసాహార ప్రియులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details