పట్టని కరోనా గోస.. కాసులపైనే ధ్యాస - ఆసిఫాబాద్ జిల్లా తాజా వార్తలు
రెవెన్యూ శాఖలో చిన్న పనికి సైతం చేయితడపనిదే కాదనేది ఎంత నిజమో మరోసారి స్పష్టమైంది.. అమాయక రైతుల నుంచి దర్జాగా డబ్బులు ఎలా వసూలు చేస్తున్నారో చింతలమానెపల్లి తహసీల్దార్ ఘటన బహిర్గతపరిచింది. సదరు తహసీల్దార్ బాగోతం అందరిని విస్తుపోయేలా చేసింది. మా అందరి దగ్గర తహసీల్దార్ డబ్బులు తీసుకున్నాడు. అంతలోనే బదిలీపై వెళుతున్నాడు. ఇక మా పని ఎవరు చేస్తారని ఆ మండల రైతులు దాదాపు 60 మంది ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేయడం అధికారుల పని తీరుకు నిదర్శనం. అయితే సదరు అధికారి ఏ రైతువద్ద ఎంత తీసుకున్నాడో కాగితంపై రాసి మరీ ఇవ్వడం గమనార్హం.
పట్టని కరోనా గోస.. కాసులపైనే ధ్యాస
By
Published : Jul 31, 2020, 2:05 PM IST
ఆసిఫాబాద్ జిల్లాలో భూ వివాదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. కొవిడ్ విస్తరణ నేపథ్యంలో పాలనాధికారి కార్యాలయంతోపాటు, మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రజలను అనుమతించడం లేదు. ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి కుప్పలు తెప్పలుగా భూ వివాదాలు పరిష్కరించాలని అర్జీలు వచ్చేవి. ఇవి పరిష్కారం కాకపోవడం, అధికారుల చేతిని తడపాల్సి రావడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
విచారణ చేస్తాం..
రెవెన్యూ శాఖాధికారులపైన ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా విచారణ చేస్తాం. బాధితులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కదం సురేష్, జిల్లా రెవెన్యూ అధికారి
అక్రమాల పరంపరలో మచ్చుకు కొన్ని..
జైనూరు మండలంలోని దబోలి గ్రామానికి చెందిన ఆడ గిరిజబాయి భర్త 2018లో చనిపోయాడు. సర్వే నెంబరు 93లో 17 ఎకరాల భూమి ఉంది. ఈమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ భూమినే సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. భర్త పేరు మీదే పట్టా పాస్‌పుస్తకం ఉండడం, ఆయన మరణించడం వల్ల మూడు సంవత్సరాల నుంచి రైతుబంధు పెట్టుబడి సహాయానికి దూరమవుతున్నారు. ఇతర వ్యవసాయ రాయితీ పథకాలు వీరికి అందడం లేదు. విరాసత్ చేయాలని అన్ని పత్రాలతో ఈ వృద్ధురాలు మండల, డివిజన్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. అడిగిన దక్షిణ సమర్పించకపోవడంతో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు. విరాసత్ కోసం జిల్లాలో అనేక మంది రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
చింతలమానెపల్లి రుద్రాపూర్‌కు చెందిన మొర్లే భీంమేరకు సర్వే నెంబర్ 92/1, 99/1లో మూడు ఎకరాల భూమి ఉంది. ఇవే వివరాలతో ఈ రైతు పేరు కాకుండా మరో రైతు పేరు మీద పాస్‌పుస్తకం ఈయనకు అధికారులు ఇచ్చారు. పేర్లు మార్చండని భీంమేర నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతూ, రెండు క్వింటాళ్ల ఉల్లి పంటను సైతం అధికారులకు ఇచ్చానని, రూ.5 వేల వరకు డబ్బులు సైతం డిమాండ్ చేశారని వాపోయాడు.
సర్వే నెంబరు 321లోని భూమి పట్టాదారు సిర్రా ఎబ్‌నేజర్ పేరు సూచిస్తున్న 2019లో ఆగస్టులో తీసిన ఈసీ
రెబ్బెన మండలం గంగాపూర్ సర్వే నెంబరు 321లో నాలుగు ఎకరాల భూమిని 1967 సంవత్సరంలో సిర్రా ఎబ్‌నేజర్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం ఈ కుటుంబం ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిపోయింది. 1993లో సిర్రా చనిపోయాడు. వీరి కుమారులకు దక్కాల్సిన ఈ భూమిని స్థానిక వ్యక్తి తన పేరు మీద రెవెన్యూ అధికారుల సహాయంతో లాక్‌డౌన్ సమయంలో మార్చుకున్నారు. ఎబ్‌నేజర్ కుమారుడు సిర్రా రమేశ్ ఈ విషయమై ఎమ్మార్వో, ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అసలు లబ్ధిదారుడిని పక్కకు పెట్టి, నకిలీ సంతకంతో భూమిని దక్కించుకున్న వ్యక్తి, మరో వ్యక్తి ఇద్దరు ఈ భూమి మాదేనని అదనపు పాలనాధికారి నిర్వహించే హియరింగ్‌కు హాజరయ్యారు. కనీసం తనగోడు వినాలన్న రమేష్ మెరను ఎవరూ ఆలకించడంలేదు. రెవెన్యూలో వ్యవస్థీకృతమైన అవినీతికి ఇలాంటి ఘటనలెన్నో పరాకాష్ఠగా నిలుస్తున్నాయి.