కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో చిక్కుకుపోయిన వలస కూలీలను కాంగ్రెస్ నాయకులు వారి సొంత రాష్ట్రాలకు తరలించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
వలస కూలీలను స్వస్థలాలకు తరలించిన కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు వలస కూలీలను వారి స్వస్థలాలకు స్థానిక నాయకులు తరలిస్తున్నారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని 300 మంది వలస కూలీలను 8 వాహనాల్లో వారి స్వస్థలాలకు పంపించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు.
లాక్ డౌన్ వల్ల చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించడం ప్రభుత్వాల బాధ్యత అయినప్పటికీ... అధిష్ఠానం ఆదేశాల మేరకు వలస కూలీలను తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని జీవన్ రెడ్డి తెలిపారు. కాగజ్ నగర్ మండలం నుంచి 300 మంది వలస కూలీలను 8 వాహనాలలో వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసిన స్థానిక నాయకులను అభినందించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను అరికట్టడం ఎంత అవసరమో ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కల్పించటం కూడా అంతే అవసరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప ప్రత్యేకంగా ప్రజలను ఆదుకోవడానికి ఆర్థిక వనరులు కల్పించలేకపోవడం దురదృష్టకరమని జీవన్ రెడ్డి వాపోయారు.