Collapsed bridge at Andevalli: 2004లో అందవెల్లి సమీపంలోని పెద్దవాగుపై 19 కోట్ల వ్యయంతో చేపట్టిన వంతెన ప్రారంభమైంది. దీంతో కాగజ్‌నగర్ నుంచి దహెగాం, భీమిని మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. 18 ఏళ్ల క్రితం ప్రారంభించిన వంతెన గతేడాది వరకు బాగానే ఉంది. 2021 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు వంతెనలోని ఒక ఫిల్లరు కుంగింది. దీంతో పాటు అప్పుడప్పుడు వంతెన అదిలినట్టు అనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలో వంతెనను పరిశీలించిన ఇంజనీర్లు,అధికారులు కుంగిన ఫిల్లర్ సరి చేస్తే చాలని నిర్ధారణకు వచ్చారు. తాత్కాలిక మరమ్మతులకు ప్రభుత్వం 22 లక్షలు మంజూరు చేసినప్పటికీ గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో శాశ్వత మరమ్మత్తులు చేయడానికి ప్రభుత్వం రెండు కోట్ల 90 లక్షల రూపాయలు మంజూరు చేయగా... ఒక్కరే టెండర్ వేశారు. ఇక పనులు ప్రారంభమవుతాయని ఆశిస్తున్న ప్రజలకు వంతెన కుప్పకూలడంతో ఆశలు నీరుగారాయి. అందెవల్లి వద్ద వంతెన కూలడంతో దహేగాం, భీమిని మండలాలతో పాటు కాగజ్‌నగర్ లోని జగన్నాథపూర్, బోడేపల్లి, జివాజీ గూడ తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం దెబ్బతింది.