తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగజ్​నగర్​ పురపాలికలో మొదలైన కో-ఆప్షన్​ సందడి

పది రోజులుగా పురపాలికల్లో రాజకీయ సందడి కొనసాగుతోంది. శుక్ర, శనివారాల్లో పలుచోట్ల కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరగనుంది. సాధారణంగా కొత్తగా ఎన్నికైన పాలకవర్గం తొలి సమావేశమైన 60 రోజుల్లో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదాపడ్డాయి. తాజాగా పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల సందడి మొదలైంది. కాగజ్​నగర్​ పురపాలికలో ఈ పదవుల కోసం పదుల సంఖ్యలో ఆశగా ఎదురుచూస్తున్నారు.

co-options elections at kagajnagar in kumurambheem asifabad district
కాగజ్​నగర్​ పురపాలికలో మొదలైన కో-ఆప్షన్​ సందడి

By

Published : Jul 24, 2020, 10:58 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు పచ్చజెండా ఊపింది. పుర ఎన్నికలు నిర్వహించిన 60 రోజుల్లోనే కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి.. ఉండగా కరోనా నేపథ్యంలో ఈ ప్రక్రియ వాయిదా పడింది. ప్రభుత్వం జీవో నెంబర్ 57, 58ను ఇటీవలే విడుదల చేసింది. కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని కాగజ్​నగర్​ పురపాలికలో ఈ పదవుల కోసం పదుల సంఖ్యలో ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమకే ఆ పదవిని కట్టబెట్టాలని ప్రధాన పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పురపాలక సంఘానికి నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఉంటారు. ఇందులో రెండు మైనారిటీలకు కేటాయిస్తారు. పురపాలిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించినట్లుగానే కో-ఆప్షన్ సభ్యులుగా మహిళలకు అవకాశం దక్కనుంది. పురపాలికల్లో పట్టణ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలు ఇవ్వడానికి కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. నిబంధనల ప్రకారం పార్టీలకు అతీతంగా ఎన్నికను చేయాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు కాగజ్​నగర్​లో కో-ఆప్షన్ పదవుల కోసం ముగ్గురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రిటైర్డ్ సహాయ బీసీ సంక్షేమ అధికారి మార్త సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ స్రవంత బాయి, గిరిగుల లక్ష్మి పురపాలక కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించారు. కాగజ్​నగర్ పురపాలక పరిధిలోని ముప్పై వార్డులు ఉండగా.. నాలుగు కో-ఆప్షన్ పదవులు ఉన్నాయి. ఇందులో రెండు కో-ఆప్షన్ పదవులు జనరల్​కు కేటాయించగా.. మరో రెండు పదవులు మైనారిటీలకు కేటాయించారు. అన్ని కేటగిరీలలో 50 శాతం పదవులను మహిళలకు కేటాయిస్తారు. మొత్తం నాలుగు పదవులలో 2 మహిళలకు, 2 పురుషులకు కేటాయించబడతాయి. జనరల్ కేటగిరి కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మున్సిపాలిటీలో అనుభవం కలిగి ఉండాలి. లేదా గెజిటెడ్ హోదాలో రిటైర్ అయిన వారు కూడా జనరల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. మైనారిటీ కోటా కింద దరఖాస్తు చేసుకునేవారికి అనుభవం అవసరం లేదు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బుద్దిస్ట్, పార్శి మతానికి చెందినవారు ఈ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకరు గెజిటెడ్ ఉద్యోగి కాగా.. మిగిలిన ఇద్దరు మహిళలు మాజీ కౌన్సిలర్లు కావడంతో వీరు జనరల్ కేటగిరిలో కో-ఆప్షన్ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.


ఇవీ చూడండి: పురపాలికల్లో కో-ఆప్షన్‌ సందడి.. అధికార పార్టీలో నేతల పోటాపోటీ

ABOUT THE AUTHOR

...view details