BRS Meeting In Asifabad : వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే గెలవబోతోందని.. అందులో ఎలాంటి అనుమానం లేదని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ చెబుతోందని.. అలాంటి వారికి పట్టం కడతారా అని సీఎం ఆక్షేపించారు. కుమురం భీం ఆసిఫాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని.. జిల్లాకు వరాల జల్లు కురిపించారు.
తెలంగాణ ఉద్యమంలో మా గూడెంలో.. మా రాజ్యం అని గిరిజనులు పోరాడేవారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో మీరందరూ కలిసి.. తనతో ఉండి పోరాడారని గుర్తు చేసుకున్నారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లను సీఎం నిధి నుంచి మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడ 335 గ్రామ పంచాయతీలకు తక్షణం రూ.10 లక్షల చొప్పున సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల జిల్లాలోని 311 పంచాయతీలకు రూ.10 లక్షలు చొప్పున సాయం ప్రకటిస్తున్నామన్నారు.
CM KCR Public Meeting in Asifabad : గతంలో వర్షాకాలం వస్తే చాలు గిరిజనులు అనేక వ్యాధులతో సతమతం అయ్యేవారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ఈ గిరిజన తండాలకు భగీరథ నీళ్లు రావడం వల్ల.. వ్యాధులు రావడం బాగా తగ్గిపోయాయని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు వస్తుంటే వార్ధా నదిపై వంతెన కావాలని ఆదివాసులు కోరారని.. తక్షణమే వంతెనను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మారుమూల ఆసిఫాబాద్‌కు కూడా.. వైద్య కళాశాలను తెచ్చుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆసిఫాబాద్‌కు ఐటీఐ కావాలని అడిగారని.. దానిని కూడా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో ఉన్న నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.