BRS Praja Ashirvada Sabha at Kagaznagar : బీఆర్ఎస్ పోరాటానికి భయపడే కాంగ్రెస్ నేతలు ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) తెలిపారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లు తాను పోరాడానన్నారు. కాగజ్‌నగర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)లో పాల్గొన్న కేసీఆర్.. ప్రసంగించారు. అనంతరం కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి రావాలంటే.. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఎన్నికల్లో సేవ చేసే వ్యక్తులకు ఓటు వేయాలని సూచించారు. రైతులు, పేదల గురించి ఆలోచించే వారికి ఓటు వేయండని అన్నారు. ప్రజల వద్ద ఉన్న ఓటే వజ్రాయుధమని వివరించారు. మనం వేసే ఓటు.. భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ఎన్నికలు అవ్వగానే కాంగ్రెస్ ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు.
పోడు భూముల పట్టాల పంపిణీకి కేంద్రం అడ్డంకిగా మారిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. రైతుబంధు(Rythu Bandhu) దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని గుర్తు చేశారు. 24 గంటల కరెంటు ఇవ్వడం వృథా అంటూ రేవంత్ రెడ్డి అంటున్నారని.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరిపోతుందా అంటూ అక్కడ సభలో ఉన్నవారిని ప్రశ్నించారు. భూవివాదాలు ఉండకూడనే ధరణి(Dharani Portal) పోర్టల్ తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ హయాంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు జరిగేవని నాటి రోజులను గుర్తుకు చేసుకున్నారు.
ఈసీ అనుమతిస్తే రైతు రుణమాఫీ ఇప్పుడే ఇస్తాం : కేసీఆర్
CM KCR Speech at Kagaznagar Sabha :ప్రస్తుతం ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే అర్ధగంటలోనే రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని హర్షించారు. ధరణిని బంగాళఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆరోపించారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్ల డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ పోర్టల్‌ను తీసేయడం వల్ల రైతులకు భూములపై ఉన్న హక్కులు పోయి.. మళ్లీ దళారుల వ్యవస్థ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.