కొలువుల్లో చేరి నిండా నాలుగు మాసాలైన గడవలేదు. రాత్రింబవళ్లు కష్టించి.. ఉన్నతోద్యోగం సాధించామన్న సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించనేలేదు. సుదూర గమ్యంలో బంగారు భవిత ఉందని భావించిన వారికి మార్గమధ్యలోనే మృత్యువు ఎదురైంది. ప్రాణహిత నది రూపంలో వారిని జలసమాధి చేసింది. కంటికి రెప్పగా కాపాడుకుంటున్న తమ బిడ్డలు.. ప్రాణాలతో లేరనే వార్తను వారి తల్లిదండ్రులకు చేరవేసింది.
నిండా నాలుగు నెలలైనా గడవలేదు..
కుమురం భీం జిల్లా చింతగూడ కోయవాగుకు చెందిన మల్లయ్య, రుక్మిణిల కుమారుడు బాలకృష్ణ 4 నెలల క్రితం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. కెరమెరి మండలం టెమ్లాగూడకు చెందిన శంకర్, లాలిబాయిల కుమారుడు సురేశ్ ఇటీవలే బీట్ అధికారిగా నియమితుడయ్యాడు. ఖర్జెల్లి రేంజ్ పరిధిలో సహోద్యోగులతో కలిసి విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ, సురేశ్ ఆదివారం శివపెల్లి ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రాణహిత నది దాటేందుకు వారు నాటు పడవను ఆశ్రయించారు. కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలంలోని గూడెంరేవుకు రాగానే ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. పడవలో ఉన్న వారు సురక్షితంగా బయటపడగా... బీట్ అధికారులు బాలకృష్ణ, సురేశ్ మాత్రం గల్లంతయ్యారు.
ఎన్డీఆర్ఎఫ్కూ దొరకని ఆచూకీ..