పక్షి ప్రేమికులకు 'బర్డ్ వాక్ ఫెస్టివల్' కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 14, 15న ప్రకృతి ప్రేమికుల కోసం 'బర్డ్ వాక్ ఫెస్టివల్' అటవీశాఖ అధికారులు జరపనున్నారు. పక్షి ప్రేమికులు ఇప్పటికే వారి పేర్లను నమోదు చేసుకున్నారని జిల్లా అటవీ శాఖ అధికారి రంజిత్ నాయక్ తెలిపారు. ఈ పండుగను వీక్షించాలంటే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే.
ఈనెల 14, 15న ఫెస్టివల్...
జిల్లాలో పక్షి జాతులు వాటి అధ్యయనం కోసం ఈనెల 14, 15న 'బర్డ్ వాక్ ఫెస్టివల్' నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడి అడవుల్లో కొత్త కొత్త పక్షులు దర్శనమిస్తాయి. ఇప్పటికే 270 రకాల పక్షులను గుర్తించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు. విభిన్న జాతులు కలిగిన వీటిని వీక్షించడం, ఆల్బమ్గా రూపొందించడం, గ్రామస్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ పండగకు శ్రీకారం చుట్టారు.
100 మంది పక్షి ప్రేమికులు..
ఇప్పటికే దాదాపు 100 మంది వరకు పక్షి ప్రేమికులు, ఉత్సాహవంతులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా 14 ,15న నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ఫొటోలు, వీడియో చిత్రీకరణ, డాక్యుమెంటరీ తయారు చేస్తారు. సర్వే, పక్షుల విధానంపై అధ్యయనం చేసి... గ్రామస్థులతో మమేకమై ప్రకృతి పట్ల ప్రేమ, అడవుల ప్రాధాన్యత ను వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
ఫెస్టివల్ నిర్వహించే ప్రాంతాలు..
కాగజ్నగర్ మండలంలోని కోసిని, సిర్పూర్ (టి ) మండలంలోని మాలిని గుట్టలు, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాలలోని నందిగామ గుట్టలు, పాలారపు గుట్టలు, మొర్రిగూడ ప్రాణహిత తీరం, తిర్యాని మండలంలోని గుండాల, ఆసిఫాబాద్ మండలంలోని కుమురం భీం జలాశయం ప్రాంతాల్లో 'బర్డ్ వాక్ ఫెస్టివల్' కోసం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి: కోట వైభవం భళా... సౌకర్యాలకై విలవిల