Bird Walk in Forest: దట్టమైన అడవులు, ఎతైన కొండలు, జాలువారే జలపాతాలు.. కనువిందు చేసే ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ పక్షుల కిలకిలరావాలు వింటూ ముందుకు సాగుతుంటే.. ఆ ఆనందమే వేరు కదూ? ఇందుకోసమే ఏకంగా 250 రకాల పక్షిజాతులకు నెలవైన ఆసిఫాబాద్ జిల్లా అడవులు రెండు రోజుల బర్డ్‌వాక్‌కు సంసిద్ధమయ్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో రెండురోజుల పాటు ఈ కార్యక్రమం సాగనుంది. ఈ మేరకు ఆసిఫాబాద్ డీఎఫ్‌వో ఎస్.శాంతారాం తెలిపారు. ఆ వివరాలు..
అదృష్టం ఉంటే పులినీ చూడొచ్చు
- ఈనెల 7న సాయంత్రం 3-6 గంటల వరకు కాగజ్‌నగర్‌లోని ఎఫ్‌డీవో కార్యాలయంలో పర్యాటకులు పేర్లు రిజస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక్కో వ్యక్తికి వసతి, భోజనం, రవాణాతో కలిపి రూ.2 వేలు. అక్కడి నుంచి బృందాల వారీగా 7న రాత్రే కాగజ్‌నగర్, సిర్పూర్, పెంచికల్‌పేట, బెజ్జూర్‌లో ఒక ప్రాంతానికి తీసుకువెళతారు.
- 8వ తేదీ ఉదయం నుంచే ప్రకృతి ప్రేమికుల ‘బర్డ్ వాక్’ మొదలవుతుంది. వారు అటవీ అందాలు తిలకిస్తూ తిరుగుతారు. జలపాతాలు చూడొచ్చు. పక్షుల కువకువలు వినొచ్చు. అదృష్టం ఉంటే పెద్దపులి కంటపడొచ్చు. లేదా అడుగుల పాదముద్రలు అయినా కనిపించవచ్చు.
- అవసరం అయినచోట టూరిస్టులను జీపులో తీసుకువెళతారు. ఆ తర్వాత అడవిలో ట్రెక్కింగ్. రోజంతా అడవుల్లో తిరుగుతూ రకరకాల పక్షుల్ని చూడొచ్చు.
- 8న రాత్రి అటవీ ప్రాంతంలోనే బస ఏర్పాట్లు చేస్తారు. 9 మధ్యాహ్నంతో అటవీ పర్యటన ముగుస్తుంది. అక్కడి నుంచి కాగజ్‌నగర్‌కు తీసుకురావడంతో మొత్తం పర్యటన పూర్తవుతుంది.
- మరిన్ని వివరాలకు ఆసిఫాబాద్ డీఎఫ్‌వో 9440810099, ఎఫ్‌డీవో 9502600496 నంబర్లలో సంప్రదించాలని అటవీశాఖ సూచించింది.