ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో ఇటీవల ఓ పెద్దపులి 17 ఏళ్ల యువకుడిని హతమార్చింది. 48 గంటల్లోపే అక్కడి అటవీ అధికారులు ఆ పులిని బంధించి ప్రజల్లో భయాందోళనల్ని తగ్గించారు. గత డిసెంబరులో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దర్ని ‘ఏ-2’ పెద్దపులి చంపింది. ఏడు నెలలైనా ఆ పులిని అధికారులు పట్టుకోలేకపోయారు. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోనే సంచరిస్తున్న ఆ పులి పెద్దసంఖ్యలో పశువుల్ని చంపుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలో ఏడాది వ్యవధిలో 119 పశువులు పెద్దపులుల దాడుల్లో హతమవగా.. అందులో దాదాపు 45 పశువుల్ని ‘ఏ-2’ చంపినట్లు అంచనా.
తరచూ ఈ పులి దాడులకు పాల్పడుతుండటంతో ఆయా ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జింకలు, నీల్గాయి వంటి వన్యప్రాణుల్ని వేటాటడం కంటే పశువుల్ని వేటాడి ఆకలి తీర్చుకోవడం సులభంగా ఉండటం పులుల ధోరణి మారడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, పశువులు, గేదెల్ని చంపేటప్పుడు వాటి నుంచి కొంత ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో మరింత సులభంగా ఆకలి తీర్చుకునేందుకు పులులు మనుషుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.