కుమురం భీం జిల్లా దహేగం మండలం దిగిడ ఆటవీప్రాంతంలో గతనెల 11న పశువులను మేపడానికి వెళ్లిన విగ్నేష్ అనే వ్యక్తిని పులి దాడి చేసి హతమార్చింది. ఆ దారుణ ఘటన మరువకముందే 20 రోజుల అనంతరం పులి మరొకరిని బలి తీసుకుంది. పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల అనే బాలిక పత్తి చేనులో పనిచేస్తుండగా.. మాటువేసి దాడిచేసి నోటకరుచుకుని వెళ్ళింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు అప్రమత్తమై పులిని తరిమేశారు. అప్పటికే నిర్మల ప్రాణాలొదిలింది. గత కొన్నేళ్లుగా బెజ్జురు, దహేగాం, పెంచికలపేట అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నప్పటికి అడపాదడపా కనిపించడం పశువులపై దాడి చేయడం పరిపాటిగా మారింది. కానీ ఒకే నెలలో ఇద్దరు మనుషులను చంపడం స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
పట్టుకునేందుకు ప్రయత్నాలు
ఈ పులి మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు తెలిపిన అధికారులు.. దాన్ని పట్టుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దాడి చేసిన సమీప ప్రాంతంలో బొన్లను, కెమెరాలను ఏర్పాటు చేసి బందించేందుకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ పులి బోన్లలో గాని కెమెరాలకు గాని చిక్కలేదు. పెంచికలపేట అటవీ ప్రాంతం వైపు పయనించినట్లు పాదముద్రలు కనుకొన్న అటవీశాఖ అధికారులు.. అది మహారాష్ట్ర వైపు వెళ్లిందనే నిర్దారణకు వచ్చారు. ఆ తర్వాత కూడా పులి కదలికలు కనిపించినప్పటికీ అవి కాగజ్నగర్ డివిజన్ పరిధిలోనివి అని అధికారులు చెప్తూ వస్తున్నారు.
5 లక్షల రూపాయలు
మరోవైపు.. పులి సంచారంతో భయాందోళనలకు గురవుతున్న ప్రజలకు ధైర్యాన్నిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజాప్రతినిధులు, అధికారులు. పులి దాడిలో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు అందించి, ఒకరికి అటవీశాఖలో ఉద్యోగం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు.