వేసవిలో ఎండమావులు వారిని ఊరిస్తున్నాయి. నీళ్లు లేక పిడచకట్టుకుపోయిన పెదాలను... తడారిపోయిన నాలుకతో తడుపుకుంటూ ఆశగా వెళ్లిన వారిని చూసి వెక్కిరిస్తూ మాయమవుతున్నాయి. ఆశగా వెళ్లిన వారంతా నిరాసతో వెనుదిరిగి.. నీటి జాడ కోసం పరిసరాల్లో గాలింపులు మొదలెడతారు. ఇవేవో కథలోని రాతలు కావు... మండే ఎండల్లో గొంతులు తడారిపోయి తాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్న కుమురం భీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని ఆదివాసి గూడాల ప్రజల కన్నీటి కష్టాలు.
దాహానికే లేవు... స్నానికెక్కడివి
ఇక్కడికొచ్చి ఏన్నో ఏళ్లైంది. మా పెద్దలు కాలం చేశారు. మేము ముసలివాళ్లమయ్యాం. ఇప్పటికీ మాకు నీటి కష్టాలు తీరలేదు. పిల్లగాళ్లు తానం చేస్తామని ఏడుస్తుంటే ఎక్కడి నుంచి తెస్తాం. తాగడానికే నీళ్లు లేవు. ఈ బాధలు ఎప్పుడు తప్పుతాయో తెలియడం లేదు.
-స్థానికుడు
తిర్యాని మండలం గ్రామపంచాయతీలో సుమారు పది ఆదివాసి గూడాలున్నాయి. అభివృద్ధికి దూరంగా కష్టాలకు చేరువగా ఉన్న ఈ ప్రాంతాల్లో సీజన్ కో సమస్య చుట్టంలా వచ్చి పలకరిస్తుంది. వేసవి వచ్చిందంటే వీరి ఇక్కట్లు వర్ణణాతీతం. బిందె నీటి కోసం గంటలు గంటలు పడిగాపులు కాయాల్సిందే. ఒక్కో గూడెంలో సుమారు 10 నుంచి 50 కుటుంబాలుంటాయి. ఊరంతా ఏకమై ఓ బావి తవ్వారు. తోడుకుని దాహం తీర్చుకోవచ్చనుకుంటే బావిలోకి దిగినా నీళ్లు దొరకని పరిస్థితి. ఎక్కడో చిన్న గుంటలో బొట్టు బొట్టుగా ఊరుతున్న నీటిని ఓపికగా తోడుకుని దాహం తీర్చుకుంటున్నారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా అప్పుడప్పుడూ సరఫరా చేస్తున్న నీటి కోసం రోజుల తరబడి ఎదురు చూస్తుంటారు.
పిల్లనివ్వనంటున్నారు
ఇదే ఊళ్లో పెళ్లైంది. నా అంతెత్తు కొడుకులున్నారు. ఆళ్లకెవళ్లనైనా పిల్లనడగాలంటే మీ ఊళ్లో నీళ్లు లేవు.. నీరులేని ఊరికి పిల్లనెట్టాఇత్తామంటున్నారు. ఇప్పటికే ఓ కొడుకుని ఇల్లరికం పంపాను. ఇంకో ముగ్గురు బిడ్డలున్నారు. వాళ్లకి పెళ్లి చేద్దామంటే ఎవ్వరూ పిల్లను ఇవ్వమంటున్నారు. వాళ్లకు పెళ్లి అవుతుందో లేదో తెలియడం లేదు.