తెలంగాణ

telangana

ETV Bharat / state

యథేచ్ఛగా మూగజీవాల అక్రమ రవాణా... - cttle smugling latest news

నోరు లేని మూగజీవాలు. మనందరికీ ఎంతో మేలు చేస్తాయి.. తప్ప హాని చేయవు. కానీ.. కొందరు అక్రమ వ్యాపారులు కర్కశంగా కబేళాలకు తరలిస్తూ వాటి రక్తపుమాంసాలతో కాసులు గడిస్తున్నారు. ఈ దందా అందరికీ తెలుసు. కానీ ఎవరూ అడ్డుకోరు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో పశువులను తరలిస్తున్నారు. అదీ కూడా మానవత్వం లేకుండా కుక్కి కుక్కి మరీ రవాణా చేస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా గణేష్​పూర్​ గ్రామంలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.

Arbitrary cattle smuggling in kumurambheem asifabad distirct
యథేచ్ఛగా మూగజీవాల అక్రమ రవాణా...

By

Published : Sep 17, 2020, 4:06 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడి మండలం గణేష్​పూర్ గ్రామంలో పశువుల సంత జరుగుతుంది. ఈ సంతలో రైతులు, పశుపోషకులు మాత్రమే తమ అవసరాల నిమిత్తం ఆవులు, బర్రెలు, ఎద్దులు, దూడలను విక్రయించేందుకు తీసుకురావాల్సి ఉంటుంది. గణేష్​పూర్​లో ఇలాంటివి అమలు కాకపోగా రైతులకు బదులు వ్యాపారులు, దళారులు పశువుల క్రయవిక్రయాలను జరుపుతున్నారు. వారానికి ఏడూ రోజులు ఇక్కడ దళారుల దందా నడుస్తోంది. వాంకిడి మండలం గణేష్​పూర్​లోని ఖాళీ ప్రాంతం వ్యాపారులు, దళారులకు అడ్డాగా మారింది. మహారాష్ట్రతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి వ్యాపారులు వాహనాల్లో పశువులను తీసుకువస్తున్నారు. పక్కరాష్ట్రంలోని చంద్రాపూర్,రాజురా లక్కడకోట ప్రాంతాల నుంచి లారీ, వ్యాన్లలో ఒక్కో దాంట్లో 20 వరకు మూగజీవాలను రవాణా చేస్తున్నారు. మూగజీవాలను వాహనాల్లో కుక్కి, పడుకోబెట్టి పైన టార్పాలిన్ కవర్లు కప్పి హైదరాబాద్​కు వందల కిలోమీటర్లు తరలిస్తుండడం వల్ల పశువులు ఊపిరాడక, గాయాల బారిన పడి మరణిస్తున్నాయి.

నిబంధనలను తుంగలో తొక్కి..

పశువుల రవాణా, క్రయవిక్రయాలపై కేంద్రం పలు నిబంధనలు విధించింది. సంతల్లోని విక్రయానికి ఎన్ని పశువులు, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయన్న విషయాలను రికార్డుల్లో రాయాలి. పశువైద్యాధికారులు అందులోని ఆరోగ్యకరమైన పశువులను పరీక్షించి వాటి విక్రయాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకునేలా ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆవులు, లేగదూడలను విక్రయాలకు తీసుకురావద్దు. కానీ ఎక్కడా కనీస నిబంధనలు అమలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు, దళారులు సంతలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. రాత్రి సమయంలో పశువులను లారీలలో ఎక్కించి కబేళాలకు తరలిస్తున్నారు.. జిల్లా వ్యాప్తంగా పశువుల క్రయవిక్రయాలు జరిగే ప్రాంతాల్లో ఒక్క అధికారి అందుబాటులో ఉండడం లేదు. సంతకు సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో ఉండడం లేదు.

ఇకనైనా అడ్డుకట్ట పడాల్సిందే..

ఈ విషయంపై కుమురంభీం అసిఫాబాద్ జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్​ కోవా లక్ష్మీ గణేష్​పూర్ గ్రామానికి రాత్రి పశువులను లారీల్లో నింపుతున్న సమయంలో వెళ్లగా.. అక్కడ ఉన్న డ్రైవర్, దళారులు పశువులు, వాహనాలను వదిలి పారిపోయారు. పోలీసులకు సమాచారం అందించి వాహనాలను సీజ్ చేసి, పశువులను గోశాలకు తరలించారు. ఆవుల అక్రమ రవాణాకు ఇకనైనా అడ్డుకట్ట పడాల్సిందేనని జడ్పీ ఛైర్​పర్సన్​ కోవా లక్ష్మీ అన్నారు. చనిపోయిన పశువులను అక్కడే పడేస్తుండడం వల్ల దుర్వాసన వస్తోందని గణేష్​పూర్ గణేష్​పూర్​ గ్రామస్థులు తెలిపారు. ఇకనైనా మూగజీవాల అక్రమరవాణాను అడ్డుకోవాలని అధికారులను కోరారు.

ఇవీ చూడండి: చేపలు చేతికొస్తాయనుకుంటే.. చనిపోయాయి

ABOUT THE AUTHOR

...view details