ఆపిల్ సాగులో మంచు ప్రదేశాలైన కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రఖ్యాతి చెందినట్లుగా ఇప్పుడు తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పేరుగాంచనుంది. రెండేళ్ల క్రితం జిల్లాలోని ఓ ప్రాంతంలో ఆపిల్ సాగు చేసిన రైతు వల్ల ఇప్పుడు ఆ పంట పలు ప్రాంతాలకు వ్యాపించింది. జిల్లాలోని కెరమెరి మండలం ధనోరకు చెందిన రైతు కేంద్రే బాలాజీ ఆపిల్ సాగు చేసి మొదటి పంటను సీఎం కేసీఆర్కు కానుకగా ఇచ్చారు. రాష్ట్రంలో మొదటి సారిగా ఇలాంటి వినూత్న ప్రయత్నం చేపట్టడంతో గతేడాది బాలాజీ రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు అందుకున్నాడు. అప్పుడు ధనోరలో సాగైన పంట.. జైనూర్ మండలానికి వ్యాపించింది.
హరితహారంలో భాగంగా
జైనూర్ మండల కేంద్రంలోని పాఠశాలలో రెండేళ్ల క్రితం హరితహారం కార్యక్రమంలో భాగంగా ధనోర నుంచి ఆపిల్ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అంతేకాకుండా జైనూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో నాటారు. ఆ మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగి కాతకు వచ్చింది. దీంతో ఇక్కడ కూడా ఆపిల్ పండించవచ్చని రుజువైంది. జైనూర్, ధనోర అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం, శీతల వాతావరణం ఉండటంతో ఇక్కడ ఆ పంట సాగు చేయడానికి పుష్కల అవకాశాలున్నాయి.
'రెండేళ్ల క్రితం ఏటీడీవో భాస్కర్ సార్ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆపిల్ మొక్కలు నాటారు. నేను సంరక్షణా బాధ్యతలు తీసుకున్నాను. నీళ్లు పోయడం, కలుపు తీయడం ఇలా అన్ని పనులు చేస్తున్నాను. మాకు కూడా ఈ పంటపై ఆసక్తి ఏర్పడింది. ప్రభుత్వం పెట్టుబడి సాయమందిస్తే బాగుంటుంది. మొక్కలు అందించి ఆర్థిక సాయం అందించినట్లయితే మేము కూలీల్లా కాకుండా యజమానుల్లా మారే అవకాశం ఏర్పడుతుంది.'