సిర్పూర్ పేపర్ మిల్లును కార్మికుల భవిష్యత్తు, స్థానికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఆగస్టు 2, 2018న ప్రభుత్వం పునః ప్రారంభించింది. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 900 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల బాయిలర్ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారు. మిల్లు పునరుద్ధరణలో భాగంగా జేకే యాజమాన్యం అతి పురాతన యంత్రాలను నవీకరిస్తోంది. మిల్లు పునరుద్ధరణలో అతి పురాతన యంత్రాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు చెబుతున్నారు.
బీమా సదుపాయాలు అందలేదు..
గతేడాది అక్టోబర్ 14న మిల్లులో భారీ పేలుడు కలకలం రేపింది. అప్పటి ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు ఈఎస్ఐ కార్డులు లేకపోవడం వల్ల ప్రైవేటు ఆసుపత్రిలో యాజమాన్యం చికిత్సలు అందిస్తోంది. నేటికి ఏలాంటి బీమా సదుపాయాలేవీ అందలేదని బాధితులు వాపోతున్నారు.