ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఐదేళ్ల బాలుడు మృతి - asifabad news
తోటి పిల్లలతో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన కుమురం భీం జిల్లా వాంకిడి మండలంలోని సోనాపూర్లో చోటుచేసుకుంది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కుమారుడు చెరువులో విగతజీవిగా తేలటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సోనాపూర్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆత్రం తిరుపతి, గీత దంపతులకు మహేశ్(7), దినేశ్(5) ఇద్దరు కుమారులు.. మరో ఇద్దరు పిల్లలతో కలిసి చెరువు గట్టుకు ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో దినేశ్ జారి చెరువులో పడిపోయాడు. మహేష్ ఇంటికి వచ్చి తల్లి గీతకు సమాచారం ఇచ్చాడు. జాలరితో వెతికించగా దినేశ్ నీటమునిగి అప్పటికే మృతి చెందాడు. తల్లి గీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.