వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల నేడు నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం-నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా నేడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లిలో దీక్షకు కూర్చోనున్నారు.
తహసీల్దారు కార్యాలయం వద్ద వేసిన శిబిరం వద్ద ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షర్మిల దీక్ష కొనసాగించనున్నారు. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారని వైతెపా వర్గాలు తెలిపాయి.
గతవారం వనపర్తి జిల్లాలో..
వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తిలో గతవారం షర్మిల పర్యటించారు. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య చేసుకున్న కొండల్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితులు.. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. కుమారుని మృతితో గుండెలవిసేలా రోదిస్తున్న వారిని షర్మిల ఓదార్చారు. వారి కడుపుకోత చూసి షర్మిల కంటతడి పెట్టారు. అనంతరం కొండల్ ఇంటి నుంచి తాడిపర్తి బస్టాండ్‌కు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై వైఎస్ షర్మిల(YS SHARMILA) నిరాహార దీక్ష చేపట్టారు.
ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా, నిరాహార దీక్ష వారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వారంగా ప్రకటిస్తున్నట్లు వైఎస్ షర్మిల గతంలో చెప్పారు. నిరుద్యోగులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నా.. కేసీఆర్ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 50 వేల ఉద్యోగాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే వరకు తమ పోరాటం ఆగదని వెల్లడించారు. నిరుద్యోగులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గత వారం వనపర్తి జిల్లాలోని తాడిపర్తిలో రోజంతా నిరాహార దీక్ష చేశారు.
నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపేందుకు వారికి భరోసా కల్పించేందుకు ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటిస్తుంది వైఎస్సార్టీపీ. నిరుద్యోగులకు అండగా మేం నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎవరు చచ్చినా.. నాకేంటి అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటంన్నింటిని భర్తీ చేయాలి. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తొలగే వరకు వైఎస్సార్టీపీ పోరాటం కొనసాగుతుంది.- వైఎస్ షర్మిల(YS SHARMILA), వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు
ఇదీ చూడండి: YS SHARMILA: ప్రతి మంగళవారం.. నిరుద్యోగ వారం: వైఎస్ షర్మిల