రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల ముఖ్య నాయకులతో వైఎస్ షర్మిల నేడు సమావేశం కానుంది. ఖమ్మం ఆత్మీయ సమ్మేళనం- బహిరంగసభ ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఈ సమావేశం జరుగనుంది.
వచ్చే నెల 9న ఖమ్మం వేదికగా వైఎస్ షర్మిల నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసుల అనుమతి లభించింది. ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఖమ్మం నగర రెండో పట్టణ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిర్వహించే సభకు ఏప్రిల్ 9న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బహిరంగ సభ నిర్వహించుకోవచ్చని తెలిపారు. 5 నుంచి 6 వేల మంది వరకు సభలో పాల్గొనేలా పూర్తిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఆంక్షలు విధించారు.