Brothers Need Help in Khammam : కడు పేదరికం. నిలువ నీడ లేదు. అమ్మానాన్నలు ఇరవై ఏళ్ల కిందటే మరణించారు. ఇద్దరు అన్నలూ దివ్యాంగులే. కళ్లు లేని వారొకరు, కాళ్లు లేని వారొకరు. ఇలాంటి స్థితిలోనూ వారి భారం తనపై వేసుకున్నాడు ఖమ్మం నగరానికి చెందిన కొణతం కిరణ్. అన్నలకు అన్నీ తానే అయి.. కూలి పనులు చేసి, వారిని సాకుతున్నాడు. కిరణ్ పెద్దన్న అమృతరావుకు పుట్టుకతోనే రెండు కాళ్లూ లేవు. రెండో సోదరుడు అనిల్ అంధుడు, మానసిక దివ్యాంగుడు. ఇద్దరిలో ఒకరికే పింఛను వస్తోంది.
ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లూ కుష్ఠు రోగుల కాలనీలో నివసించామని, ఇటీవల నగర శివారులోని అగ్రహారం కాలనీకి మారామని చెప్పాడు కిరణ్. సోదరులు ముగ్గురూ తమకు జీవనోపాధి, ఇల్లు ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఆధార్, రేషన్‌కార్డు, సదరం ధ్రువీకరణ పత్రం కలిగి అర్హత ఉన్నా తమకు సాయం అందడంలేదని వాపోతున్నారు.