Ponguleti Srinivas Comments on BRS: రానున్న ఎన్నికల్లో తాము ఏ పార్టీలో చేరుతామో ఆ పార్టీనే అధికారంలోకి రానుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యతో కలిసి క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం.. బీఆర్‌ఎస్ పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రభుత్వం మరో ఐదారు నెలలు మాత్రమే మనుగడలో ఉంటుందని పొంగులేటి జోస్యం చెప్పారు. ఆ విషయాన్ని మరిచిపోయి అధికారులు వారికి తొత్తులుగా ప్రవర్తిస్తే.. సహించేది లేదని హెచ్చరించారు. తనతో పాటు తన వెంటే ఉన్న అనుచరులకు భద్రతను తగ్గించారన్నారు. సెక్యూరిటీ తగ్గించడం వల్ల తమకు ఏమైనా ప్రాణ హాని కలిగితే.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇద్దరు ఎస్పీలే బాధ్యత వహించాల్సి వస్తోందని తెలిపారు.
బీఆర్‌ఎస్ కండువా కప్పుకుంటేనే రైతు బంధు: బీఆర్‌ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్న రైతుల అకౌంట్‌లోనే ప్రభుత్వం డబ్బులు వేస్తోందని.. ఇతర పార్టీలకు చెందిన రైతులకు నగదు జమ చేయడం లేదని విమర్శించారు. వారిని అసలు రాష్ట్ర ప్రభుత్వం రైతులుగా గుర్తించడం లేదని మండిపడ్డారు.