రాష్ట్రంలో ఐటీని ద్వితీయశ్రేణి నగరాలను విస్తరించే ప్రణాళికలో భాగంగా ఖమ్మంలో ఐటీహబ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. రూ.25 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రులు పువ్వాడ అజయ్, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీతో కలిసి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఆరు అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. ఇప్పటికే దాదాపు 19 కంపెనీలు ఇక్కడ నమోదుచేసుకున్నాయి. ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కేటీఆర్ తెలిపారు. ఐటీ హబ్ రెండో దశ కోసం రూ.20 కోట్లు త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం యువత ఐటీ హబ్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలప్పుడే రాజకీయాలు
అంతకుముందు మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఖానాపురం మినీ ట్యాంక్ బండ్, బల్లేపల్లి వైకుంఠధామం సహా... పలు చోట్ల రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. రూ.6.37 కోట్లతో సకల సౌకర్యాలతో నిర్మించిన పోలీస్ కమిషనరేట్ భవనంతో పాటు... పలు చోట్ల పార్కులు, ప్రకృతి వనాలు... రూ.77 కోట్లతో నిర్మించిన ధంసలాపురం ఆర్వోబీని ప్రారంభించారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన ఖమ్మం నగర ప్రగతిని మున్ముందూ కొనసాగిస్తామని కేటీఆర్ అన్నారు. ఇతర మేయర్లను ఖమ్మం పంపి అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించమని సూచిస్తానన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి తప్ప... మిగత సమయంలో అన్నివర్గాలను కలుపుకుపోతామని మంత్రి స్పష్టం చేశారు.