తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సర్కారు బడుల్లో కానరాని శుద్ధజలం ప్లాంట్లు - Bhadradri Kothagudam District Latest News

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్లు అలంకార ప్రాయంగా మారాయి. చిన్న చిన్న మరమ్మతులు వచ్చినా.. బాగు చేసేందుకు నిధుల్లేక, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఏళ్ల తరబడి పాఠశాల గదుల్లో పనికిరాకుండా పోతున్నాయి. కొన్ని పాఠశాలల్లో మూడు, నాలుగు నెలలకే మూలనపడ్డాయి. చాలా పాఠశాలల్లో విలువైన యంత్ర పరికరాలు తుప్పుబట్టి పోతున్నాయి.

శుద్ధజలం
శుద్ధజలం

By

Published : Sep 9, 2022, 3:16 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్ల కోసం చేసిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 1215 ప్రభుత్వ పాఠశాలల్లో 92,000 విద్యార్థులు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 1353 ప్రభుత్వ పాఠశాలల్లో 84,700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో ఎక్కువ ప్రభుత్వ బడులు ఉన్నాయి.

ఆయా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు స్వచ్ఛమైన మంచి నీటిని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొన్నేళ్ల కిందట జలమణి పథకం కింద ప్రభుత్వ బడుల్లో శుద్ధజల ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఉభయ జిల్లాల్లో మండలాల వారీగా శుద్ధజల ప్లాంట్లు అవసరం ఉన్న పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రభుత్వ నిధులతోపాటు ప్రజాప్రతినిధుల నిధులు, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో చాలా చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేశారు.

శుద్ధజల ప్లాంట్లు అందుబాటులోకి రావడంతో కొంతకాలం పాటు స్వచ్ఛమైన తాగునీరు అందింది. ఆ తర్వాత కొన్నాళ్లకే యంత్రాలు మూలనపడ్డాయి. వినియోగం సక్రమంగా లేక కొన్నిచోట్ల, నాణ్యమైన పరికరాలు లేక అలంకార ప్రాయంగా మారాయి. శుద్ధజల ప్లాంట్లు ఏర్పాటు చేసిన గుత్తేదారు.. ధనదాహం తీరింది కానీ.. విద్యార్థులకు మాత్రం తాగునీరు అందడం లేదు. ప్రస్తుతం విద్యార్థులకు చేతి పంపులు, బోరు నీళ్లు.. ఇళ్ల నుంచి తెచ్చుకున్న నీటితోనే దాహార్తి తీర్చుకోవాల్సి వస్తుంది.

కస్తూర్బా విద్యాలయాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉభయ జిల్లాల్లో మొత్తం 28 కస్తూర్బా పాఠశాలల్లో శుద్ధజల ప్లాంట్లు ఉన్నప్పటికీ ఎక్కడా సక్రమంగా పనిచేయడం లేదు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి పాఠశాలల్లో మూలనపడ్డ శుద్ధజల ప్లాంట్లకు మరమ్మతులు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details