తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం నగర సిగలో మరో మణిహారం.. వాకర్స్​ ప్యారడైజ్​ - mini lakaram tankbund

ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, పచ్చిక బయళ్లు, పక్కనే జలకళతో కళకళలాడుతున్న చెరువు.. దాని చుట్టూ వాకర్స్ ట్రాక్ వంటి అన్ని హంగులతో తీర్చిదిద్దిన మినీ లకారం ఖమ్మం నగరవాసుల మదిని దోచేస్తోంది. ఇప్పటికే లకారం ట్యాంక్​బండ్​తో పాటు నగరమంతా విద్యుత్ వెలుగులు, సెంట్రల్ లైటింగ్, ఫౌంటేన్​లతో సరికొత్త హంగులతో ముచ్చటగొలుపుతున్న ఖమ్మం నగర సిగలో మినీ లకారం వాకర్స్ ప్యారడైజ్ రూపంలో మరో మణిహారం చేరింది. ఎటుచూసినా పచ్చదనం, అద్భుతమైన ఏర్పాట్లతో అందంగా ముస్తాబైన వాకర్స్ ప్యారడైజ్.. ప్రభాత కిరణాలు పడుతున్న వేళ.. నగర పౌరుల వ్యాయామానికి దిక్సూచిగా మారి ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతోంది.

walkers paradise in khammam city
ఖమ్మం నగర సిగలో మరో మణిహారం.. వాకర్స్​ ప్యారడైజ్​

By

Published : Dec 4, 2020, 1:19 PM IST

Updated : Dec 4, 2020, 2:21 PM IST

ఖమ్మం నగర సిగలో మరో మణిహారం.. వాకర్స్​ ప్యారడైజ్​

అభివృద్ధి పథంలో వడివడిగా దూసుకెళ్తున్న ఖమ్మం నగరంలో మరో మణిహారం చేరింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధిలో సరికొత్త హంగులు అద్దుకుంటూ ముందుకెళ్తున్న ఖమ్మం నగరం.. మరిన్ని సరికొత్త హంగులతో ముస్తాబవుతోంది. ఇప్పటికే నగర వాసులకు ముచ్చటగొలిపేలా రూపుదిద్దుకుని అందుబాటులోకి వచ్చిన లకారం ట్యాంక్ బండ్.. నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదే కాకుండా నగరంలో ఎక్కడ చూసినా సెంట్రల్ లైటింగ్, ఫౌంటెన్ల నిర్మాణం, డివైడర్ల ఏర్పాటుతో నగర రూపురేఖలు మారిపోగా.. తాజాగా మినీ లకారం అందుబాటులోకి రావడం వల్ల నగర సిగలో మరో మణిహారం చేరినట్లయింది.

ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం

ఒకనాడు లకారం చెరువుగా ఉన్న ఈ మినీ లకారం.. చెత్తా చెదారం, మురుగునీటితో నిండి దుర్గంధం వెదజల్లేది. లకారం ట్యాంక్​బండ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత మినీలకారం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్... నగరవాసులకు ప్రత్యేకంగా కేవలం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ మినీ లకారం వాకర్స్​ ప్యారడైజ్​కు శ్రీకారం చుట్టారు. వాకర్స్ సంఘాల ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి... వాకర్స్ ప్యారడైజ్​ను అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేశారు. గాంధీ జయంతి రోజున అందుబాటులోకి వచ్చిన ఈ వాకర్స్ ప్యారడైజ్... నగర వాసుల్ని ముచ్చట గొలుపుతోంది. వాకింగ్ చేసే వారికి ఆరోగ్యంతోపాటు ప్రత్యేకమైన ఆహ్లాదాన్ని పంచుతోంది.

విశేషంగా ఆకట్టుకుంటున్న ఏర్పాట్లు

ఖమ్మం ప్రజల కోసం నగరంలో ఇప్పటికే నాలుగైదు వాకింగ్ ప్రదేశాలు ఉన్నప్పటికీ... ఈ వాకర్స్ ప్యారడైజ్ ప్రత్యేకతను సంతరించుకుంది. లకారం ట్యాంక్ బండ్, మమత రోడ్, ప్రభుత్వ కళాశాల మైదానం, పెవిలియన్ మైదానం, సర్దార్ పటేల్ స్టేడియం, పోలీస్ పరేడ్ గ్రౌండ్​తోపాటు మరికొన్ని చోట్ల వాకింగ్​కు సౌకర్యం ఉన్నప్పటికీ... వాకర్స్ పారడైజ్​లో ఉన్న సదుపాయాలు ఎక్కడా లేవు. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చిక బయళ్లు, పచ్చని చెట్లు, పక్కనే కళకళలాడుతున్న చెరువు... ఈ వాకర్స్ ప్యారడైజ్​లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం 1.7 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్​ను నిర్మించారు. వీటితోపాటు రన్నింగ్ ట్రాక్, యోగా, ఓపెన్ జిమ్​తో పాటు ప్రత్యేక విద్యుత్ ఏర్పాట్లు చేశారు. లాఫింగ్ క్లబ్ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు, వాకర్స్ విశ్రాంతి తీసుకునేందుకు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో దాదాపు 5 వేల మొక్కలు నాటారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ వాకర్స్ ప్యారడైజ్ ఉదయం, సాయంత్రపు నడకలతో కళకళలాడుతోంది. మినీ లకారం వాకర్స్ ప్యారడైజ్​కు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

నగరవాసులు హర్షం వ్యక్తం

మినీ లకారం ఎప్పుడూ పచ్చదనంతో ఉండేందుకు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు వాకర్స్ ప్యారడైజ్​లో ప్రత్యేకంగా క్లబ్ ఏర్పాటు చేశారు. ఈ వాకర్స్ పారడైజ్ క్లబ్​లో నామమాత్రపు రుసుములు వసూలు చేస్తూ.. సభ్యులను చేర్చుకుంటున్నారు. మెరుగైన వసతులను, అన్ని హంగులు సమకూరిన మరో ఆహ్లాదకరమైన ప్రాంతం అందుబాటులోకి రావడం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'దేశ వాతావరణ పరిస్థితులకు తగిన టీకా ఎంపిక చేసుకోవడమే ముఖ్యం'

Last Updated : Dec 4, 2020, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details