ఒక ఊరిలో ఏడుగురు మృతదేహాలు.. మరో గ్రామంలో ఇద్దరు, ఇంకో గ్రామంలో ముగ్గురు.. ఇలా ఏపీలోని కృష్ణా జిల్లా వేదాద్రి రోడ్డు ప్రమాదం మిగిల్చిన తీరని విషాదం.. ఆయా గ్రామాలను శోక సంద్రంలో ముంచెత్తింది. మొక్కు తీర్చుకునేందుకు దైవదర్శనానికి వెళ్లిన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెదగోపవరంకు చెందిన వేమిరెడ్డి గోపిరెడ్డి కుటుంబం, ఆయన బంధువుల కుటుంబాలకు తీరని వేదన మిగిల్చింది. ఆ ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలు శవపరీక్షల తర్వాత స్వగ్రామాలకు చేరుకోగా.. బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
తీరని విషాదం
పెద్దగోపవరంకు చెందిన గోపిరెడ్డి కుటుంబీకుల్లో నలుగురు చనిపోవడం వల్ల ఆ ఇంట్లో తీరని విషాదం చోటుచేసుకుంది. చనిపోయిన కుటంబీకులను చూసి ఏడ్చేందుకు కూడా ఎవరూ మిగలలేదని బంధువులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. గోపిరెడ్డి తల్లి పద్మావతి, కుమార్తె ఉదయశ్రీ, ఆయన తాతా, నాయనమ్మ పుల్లారెడ్డి, భారతమ్మల మృతదేహాలతోపాటు గోపిరెడ్డి పెద్దమ్మ, లక్కిరెడ్డి, అప్పమ్మల అంత్యక్రియలు పెదగోపవరంలోని స్మశానవాటికలో నిర్వహించారు. ఒకే గ్రామంలో ఏడుగురి అంత్యక్రియలు నిర్వహించడం వల్ల ఆ గ్రామంలో తీరని విషాదం అలుముకుంది.
జయంతి గ్రామంలో
వెంకటాపురంలో తిరుపతమ్మ అంత్యక్రియలు నిర్వహించగా.. కృష్ణా జిల్లా కొణతాలపల్లిలో రాజేశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాదంలో మృతిచెందిన మరో ముగ్గురు బంధువులు సూర్యనారాయణ రెడ్డి, రమణమ్మ, ఉపేందర్ రెడ్డిల అంత్యక్రియలు కృష్ణా జిల్లా జయంతి గ్రామంలో జరిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం వల్ల ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.