Vanama Raghava Released From Jail : ఖమ్మం జిల్లా జైలు నుంచి వనమా రాఘవ విడుదలయ్యాడు. రాఘవకు హైకోర్టు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగు పెట్టవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రతి శనివారం ఖమ్మం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టాలని షరతుల్లో పేర్కొంది.
సెల్ఫీ వీడియో సెన్సేషన్..
Palwancha Family Suicide Case : పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ రెండు నెలలు జైల్లో ఉన్నాడు. తమ కుటుంబం బలవన్మరణానికి కారణం వనమా రాఘవ అంటూ రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. నిందితుడి అరెస్ట్ వెనకాల నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు తన కుమారుడిది తప్పుంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ప్రకటించిన వనమా వెంకటేశ్వరరావు.. రాఘవను అప్పగిస్తానని ప్రకటించారు.
బెయిల్ మంజూరు..
Palvancha Family Suicide Case : ఆ తర్వాత కూడా అరెస్ట్ వెనుక హైడ్రామా నడిచింది. అతని బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. విపక్షాలు కూడా వనమా రాఘవా ఆగడాలపై గొంతెత్తాయి. ఆందోళనలు, బంద్‌తో హోరెత్తించాయి. చివరకు పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా షరతులతో మంజూరుచేసింది.