Untimely Rains Damage Cotton Crop In Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లా పత్తి రైతులకు ఈ సంవత్సరం నష్టాల మూటలే దిగుబడులుగా మిగులుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో లక్షా 79వేల 287 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్షా 99వేల 720 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. సీజన్ ఆరంభం నుంచి అన్నదాతకు కాలం పరీక్ష పెడుతూనే ఉంది. జూన్, జులై మాసాల్లో వర్షాలు రైతులతో దాగుడు మూతలాడటంతో రైతులు, ఒకటికి రెండు మూడు సార్లు విత్తనాలు నాటుకోవాల్సి వచ్చింది.
సీసీఐ రంగంలోకి దిగిన సరే.. పత్తి రైతుకు దక్కని మద్దతు ధర..
వర్షాలతో పంట నష్టం : ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు లేకపోవటంతో పంట ఎదుగుదల లోపించింది. దీనికి తోడు తెగుళ్లు సోకి పంట ఎండిపోవటంతో కర్షకులకు కష్టాలు తప్పలేదు. ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవటంతో రైతులు అదనపు పెట్టుబడులు పెట్టారు. వ్యయ ప్రయాసల కొర్చి చేతికందిన నాలుగు దూది పూలు ఏరుకుందామనేలోపే అన్నదాతలపై తుపాను ఊహించని పిడుగులా పడింది. వర్షపు నీటిలో తడిసిన పత్తి రంగు మారి రైతుకు గుండె కోత మిగిల్చింది.
"పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయి. క్వింటాల్‌కు రూ.10,000 వస్తే మాకు గిట్టుబాటు అవుతుంది. కూలీలకు ఇచ్చే దినసరి కూలీ, రవాణా ఖర్చులు పెరిగాయి. గత ఏడాది రూ.8000 ఉన్న ధర ప్రస్తుతం వ్యాపారులు తక్కువగా చెబుతున్నారు. వర్షాల కారణంగా సగం పత్తి పంట మట్టిపాలైంది. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి." - పత్తి రైతులు