వారిద్దరూ మానసిక స్థితి సరిగా లేక వివిధ ప్రాంతాలు తిరుగుతూ... రైళ్ల ద్వారా ఖమ్మం నగరానికి చేరుకున్న అభాగ్యులు. అందరూ ఉన్నా... విధి చేసిన గాయంతో మానసిక దివ్యాంగులుగా మారి.. రహదారుల వెంట, చెత్తకుప్పల్నే ఆవాసాలుగా మార్చుకున్న అన్నార్థులు. తమ చేష్టలు, విచిత్రమైన ఆహార్యంతో ఎదుటి వారిని భయభ్రాంతాలకు గురిచేస్తూ... దుర్భర జీవితాలను అనుభవిస్తున్న వారిని అన్నం సేవా సంస్థ అక్కున చేర్చుకుంది. కొన్నేళ్లపాటు వారి బాగోగులు చూడటమే కాకుండా మంచి మనుషులుగా తీర్చిదిద్దింది. వారి చిరునామా సేకరించి... సొంతవారి వద్దకు తీసుకెళ్లేందుకు నడుం బిగించింది.
చిరుమానా చెప్పలేని స్థితి నుంచి
అసోంలోని వోలాఘాట్ జిల్లా ఒత్తిపొరియా గ్రామానికి చెందిన చునిల్ గొగాయ్కు 45 ఏళ్లు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మానసిక స్థితి సరిగా లేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. ఎక్కడెక్కడో తిరిగి రైలు మార్గం ద్వారా 2017లో ఖమ్మం చేరుకున్నాడు. దుర్భర పరిస్థితుల్లో ఖమ్మం నగర వీధుల్లో తిరుగుతున్న అతనిని చూసి స్థానికులు... అన్నం సేవా సంస్థకు సమాచారం అందించారు. ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావు... గొగాయ్ని ఆశ్రమానికి తరలించి సపర్యలు చేశారు. చిరునామా చెప్పలేని స్థితిలో ఉన్న అతనికి వైద్యం చేయించి బాగుచేశారు. కోలుకున్న బాధితుడు ఆశ్రమంలోనే వంటలు చేస్తూ ఉండేవాడు. దాదాపు 4 ఏళ్ల తర్వాత గొగాయ్ చెప్పిన వివరాల ఆధారంగా... అసోంకి చెందిన వాసిగా గుర్తించారు. గుహటి ఐఐటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఇల్లెందు వాసి నందకిశోర్ ద్వారా... గొగాయ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.